Loading...
Pete Hegseth: హెగ్‌సెత్‌కు భారీ ఊరట.. అభిశంసనకు అమెరికా సభ బ్రేక్!
హెగ్‌సెత్‌కు భారీ ఊరట.. అభిశంసనకు అమెరికా సభ బ్రేక్!

Pete Hegseth: హెగ్‌సెత్‌కు భారీ ఊరట.. అభిశంసనకు అమెరికా సభ బ్రేక్!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్‌పై అభిశంసనకు సంబంధించిన ప్రయత్నానికి ప్రతినిధుల సభ అడ్డుకట్ట వేసింది. రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న అమెరికా ప్రతినిధుల సభలో ఈ తీర్మానాన్ని న్యాయ వ్యవహారాల కమిటీకి పంపే ప్రతిపాదనపై ఓటింగ్ జరిగింది. దీనికి అనుకూలంగా 211 మంది, వ్యతిరేకంగా 204 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో అభిశంసన ప్రక్రియ ప్రస్తుతానికి నిలిచిపోయే అవకాశం ఏర్పడింది. వచ్చే ఏడాది జనవరిలో కొత్త కాంగ్రెస్ సమావేశమయ్యే వరకు ఈ వ్యవహారం ముందుకు వెళ్లకపోవచ్చు. డెమోక్రాట్లకు మద్దతుగా రిపబ్లికన్ సభ్యుడు థామస్ మాసీ మాత్రమే ఓటు వేశారు. మిగతా రిపబ్లికన్ సభ్యులంతా ఈ తీర్మానాన్ని కమిటీకి పంపేందుకు మద్దతు తెలిపారు.

వివరాలు 

ట్రంప్ ప్రశంసలు.. 'గొప్ప దేశభక్తుడు' అంటూ కితాబు

ఈ ఓటింగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.

హెగ్‌సెత్‌పై డెమోక్రాట్లు చేసిన అభిశంసన ప్రయత్నం ఘోరంగా విఫలమైందని వ్యాఖ్యానించారు.

రక్షణ మంత్రిగా హెగ్‌సెత్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ.. ఆయనను 'గొప్ప అమెరికా దేశభక్తుడు' అని అభివర్ణించారు.

థామస్ మాసీ మినహా ప్రతి ఒక్క రిపబ్లికన్ సభ్యుడూ హెగ్‌సెత్‌కు మద్దతుగా ఓటు వేశారని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు.

మాసీని ఓడిపోయిన వ్యక్తిగా విమర్శించారు. వెనెజువెలా, ఇరాన్‌కు సంబంధించి అమెరికా సాధించిన విజయాలు, సైన్యంలో రికార్డు స్థాయిలో నియామకాలు, అమెరికా సైనికుల్లో పెరిగిన ఉత్సాహానికి హెగ్‌సెత్ నాయకత్వమే కారణమని ట్రంప్ ప్రశంసించారు.

వివరాలు 

ఇరాన్ యుద్ధంపై అసంతృప్తి.. అభిశంసనకు ప్రధాన కారణం

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి హెగ్‌సెత్‌పై అభిశంసన ప్రయత్నానికి ప్రధాన కారణంగా మారింది.

హర్మూజ్ జలసంధి ప్రాంతంలో యుద్ధం ప్రతిష్ఠంభనకు చేరుకోవడంతో ఈ వ్యతిరేకత మరింత పెరిగింది.

కాంగ్రెస్ అనుమతి లేకుండానే ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించడం ద్వారా హెగ్‌సెత్ తన అధికారాలను దుర్వినియోగం చేశారని అభిశంసన తీర్మానంలో ఆరోపించారు.

పౌరుల ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు రూపొందించిన చట్టాలను ఆయన పట్టించుకోలేదని పేర్కొన్నారు.

కరేబియన్ సముద్ర ప్రాంతంలో పెంటగాన్ చేపట్టిన పడవలపై దాడుల్లో న్యాయపరమైన విచారణ లేకుండా హత్యలకు ఆదేశించారని ఆరోపించారు.

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేయాలని ఆదేశించారనే ఆరోపణలతో పాటు మరికొన్ని అంశాలను కూడా తీర్మానంలో ప్రస్తావించారు.

ADVERTISEMENT

వివరాలు 

1876లో చివరిసారిగా పౌర సైనికాధికారిపై అభిశంసన

హెగ్‌సెత్‌పై అభిశంసన తీర్మానాన్నిరిపబ్లికన్ సభ్యుడు థామస్ మాసీ రూపొందించారు.

ట్రంప్,హెగ్‌సెత్‌లపై తీవ్ర విమర్శలు చేసే మాసీ.. వారిపై తన వ్యతిరేకతను ఈ తీర్మానం ద్వారా వ్యక్తం చేశారు.

ఇరాన్ యుద్ధంతో పాటు,వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను పదవి నుంచి తొలగించేందుకు జనవరిలో అమెరికా చేపట్టిన ఆపరేషన్‌ను కూడా ప్రస్తావించారు.

హెగ్‌సెత్‌పై'తీవ్రమైన నేరాలు,దుష్ప్రవర్తన'కు సంబంధించిన ఆరోపణలు చేశారు.

కెంటకీకి చెందిన రిపబ్లికన్ నేత మాసీ ఈ ఏడాది జరిగిన పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఓడిపోయారు.

దీంతో వచ్చే ఏడాది జనవరి ప్రారంభంలో రాజకీయాల నుంచి తప్పుకోనున్నారు.

కాగా,అమెరికా సైన్యానికి నాయకత్వం వహించే పౌర ఉన్నతాధికారిపై చివరిసారిగా 1876లో అభిశంసన ప్రక్రియ చేపట్టారు.

అప్పట్లో యుద్ధశాఖ మంత్రిగా ఉన్న విలియం బెల్‌నాప్‌పై ఈ చర్య తీసుకున్నారు.

ADVERTISEMENT