LOADING...
Trump: అణ్వస్త్రాలకు ఇరాన్‌ గుడ్‌బై?.. యూరప్‌లో సంతకాలు జరుగుతాయని ట్రంప్‌ వెల్లడి
అణ్వస్త్రాలకు ఇరాన్‌ గుడ్‌బై?.. యూరప్‌లో సంతకాలు జరుగుతాయని ట్రంప్‌ వెల్లడి

Trump: అణ్వస్త్రాలకు ఇరాన్‌ గుడ్‌బై?.. యూరప్‌లో సంతకాలు జరుగుతాయని ట్రంప్‌ వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2026
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌తో కీలక ఒప్పందం కుదిరే దశకు చేరుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అణ్వాయుధాల కార్యక్రమాన్ని విరమించుకునేందుకు ఇరాన్ అంగీకరించిందని, ఈ వారాంతంలో యూరప్‌లో ఇరు దేశాల మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశముందని ఆయన వెల్లడించారు. వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కుదుర్చుకోబోయే ఒప్పందం తుది దశకు చేరుకుందని ట్రంప్ తెలిపారు. ఈ డీల్ అమల్లోకి వస్తే ఇరాన్ భవిష్యత్తులో ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయదని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

ట్రంప్ ప్రకటనకు భిన్నంగా స్పందించిన ఇరాన్

అలాగే ఒప్పందం పూర్తయిన తర్వాత హర్మూజ్ జలసంధి మళ్లీ సాధారణ కార్యకలాపాలకు తెరుచుకుంటుందని, దీని వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఉన్న ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదిత ఒప్పందానికి ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తాబా ఖమేనీ కూడా ఆమోదం తెలిపి ఉంటారని తాను నమ్ముతున్నట్లు ట్రంప్ చెప్పారు. యూరప్‌లో ఈ వారాంతంలో జరిగే సంతకాల కార్యక్రమానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరవుతారని వెల్లడించారు. అయితే ట్రంప్ ప్రకటనకు భిన్నంగా ఇరాన్ స్పందించింది. ఈ ఒప్పందంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు.

వివరాలు 

నెతన్యాహు ప్రశంసలు

ట్రంప్ మాత్రం ఈ వారంలోనే ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని చెబుతుండగా, ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ ప్రకటించడం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్‌తో ప్రతిపాదిత ఒప్పందంపై చర్చించినట్లు సమాచారం. ట్రంప్ చేపట్టిన ప్రయత్నాలను నెతన్యాహు అభినందించినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ ప్రత్యక్ష భాగస్వామి కాదని స్పష్టం చేసినప్పటికీ, సుసంపన్నమైన యురేనియం నిల్వలను తొలగించడం, క్షిపణి తయారీ కార్యక్రమాలపై కఠిన పరిమితులు విధించడం వంటి అంశాలు తుది ఒప్పందంలో ఉంటాయని ట్రంప్ హామీ ఇచ్చినట్లు పేర్కొంది.

Advertisement

వివరాలు 

అమెరికా దాడులపై ఇరాన్ ఆగ్రహం

భారతీయులు ప్రయాణిస్తున్న నౌకలపై అమెరికా జరిపిన దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఈ దాడులు క్రూరమైనవని ఇస్మాయిల్ బఘాయీ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు కలిగించడమే కాకుండా అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో నౌకాయాన స్వేచ్ఛకు కూడా ఆటంకం కలిగించే అమెరికా చర్యలను ప్రపంచ దేశాలు ఖండించాలని ఇరాన్ పిలుపునిచ్చింది.

Advertisement