Iran-Oman: ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి.. హర్మూజ్ తెరిచేందుకు మార్గం సుగమం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధి అంశంపై ఇరాన్, ఒమన్ మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల దిశగా సాగుతున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో భాగంగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరు దేశాలు సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం, వాణిజ్య రవాణా నౌకలు పర్షియన్ గల్ఫ్‌లోని ఇరాన్ నియంత్రణ ప్రాంతం గుండా ప్రయాణించి, ఒమన్ ఆధీనంలోని జలాల ద్వారా బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు భద్రత కల్పించే బాధ్యతను సంబంధిత దేశాలు తీసుకోనున్నాయి. అందుకు ప్రతిగా నౌకల నుంచి సేవా రుసుము వసూలు చేసే ప్రతిపాదన కూడా చర్చల్లో చోటు చేసుకుంది.
వివరాలు
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ తాత్కాలికంగా సద్దుమణిగే అవకాశాలు
ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ తాత్కాలికంగా సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని,తుది ఒప్పందం ప్రస్తుతం చర్చిస్తున్న రూపానికి కొంత భిన్నంగా ఉండొచ్చని ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న అధికారులు వెల్లడించారు.
హర్మూజ్ జలసంధిలో అమెరికా విధించిన ఆంక్షలు లేదా నిర్బంధ చర్యల సడలింపుతోనే ఏ తుది ఒప్పందమైనా ముడిపడి ఉంటుందని వారు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా,యెమెన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న భారత జాతీయపతాకం కలిగిన వాణిజ్య నౌక ఎంఎస్‌వీ ఫైజే నూరె ఓలియాపై మంగళవారం దాడి జరిగినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది.
దాడి అనంతరం ఆ నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్లు తెలిపింది.
వివరాలు
నౌకలో ఉన్న 13 మంది భారతీయులు
ఈ ఘటన సమయంలో నౌకలో ఉన్న 13 మంది భారతీయులు సురక్షితంగా బయటపడినట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
భారత ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, పశ్చిమాసియా ప్రాంతంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.