Loading...
Business and Tourist Visas: అమెరికాలో ట్రంప్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. 2 లక్షల వ్యాపార, పర్యాటక వీసాల రద్దు?
2 లక్షల వ్యాపార, పర్యాటక వీసాల రద్దు?

Business and Tourist Visas: అమెరికాలో ట్రంప్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. 2 లక్షల వ్యాపార, పర్యాటక వీసాల రద్దు?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2026
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ట్రంప్‌ ప్రభుత్వం వీసాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అక్రమ వలసలను అడ్డుకునే చర్యల్లో భాగంగా సుమారు 2 లక్షల మంది విదేశీయులకు జారీ చేసిన వ్యాపార, పర్యాటక వీసాలను రద్దు చేసే అంశాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. వ్యాపారం లేదా పర్యాటకం పేరుతో అమెరికాలోకి ప్రవేశించి, ఆ తర్వాత అక్కడే ఉండేందుకు ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకునే వారిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 2016 నుంచి 2026 మధ్య జారీ చేసిన B1, B2 వీసాలు ఈ చర్య పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

ఆశ్రయం కోసం వీసాల దుర్వినియోగం

ఒకవేళ ఇంత పెద్ద సంఖ్యలో వీసాలను ఒకేసారి రద్దు చేస్తే.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సామూహిక వీసా రద్దు చర్యగా ఇది నిలిచే అవకాశం ఉంది.

దీనిపై మరికొన్ని వారాల్లో అమెరికా విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

స్వల్పకాలిక సందర్శకులుగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న కొందరు విదేశీయులు.. ఆ తర్వాత అక్కడే శాశ్వతంగా ఉండేందుకు ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ తెలిపారు.

ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్న నాన్‌-ఇమిగ్రెంట్ వీసాదారులను గుర్తించి, వారి వీసాలను రద్దు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

వివరాలు 

B1, B2 వీసాలు దేనికి?

ఇలాంటి వ్యక్తులను గుర్తించే ప్రక్రియలో అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం, స్టేట్ డిపార్ట్‌మెంట్‌ కలిసి పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

అయితే వీసా రద్దు చేసినంత మాత్రాన సంబంధిత వ్యక్తులను వెంటనే అమెరికా నుంచి బహిష్కరించే అవకాశం లేదని తెలుస్తోంది.

వారి వీసా హోదాను మరో విధంగా పునర్‌వర్గీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అమెరికాలో వ్యాపార సంబంధిత పర్యటనల కోసం సాధారణంగా B1 వీసాలను జారీ చేస్తారు.

సమావేశాలు, వ్యాపార చర్చలు, వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన స్వల్పకాలిక ప్రయాణాలకు ఇవి ఉపయోగపడతాయి.

మరోవైపు పర్యాటకం, కుటుంబ సభ్యులను కలవడం, వైద్య చికిత్స వంటి అవసరాల కోసం B2 వీసాలను జారీ చేస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

ఆశ్రయం వ్యవస్థను లొసుగుగా మార్చొద్దు

మరోవైపు అమెరికాలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకునే ముందు కొంతమంది విదేశీయులు పర్యాటక, వ్యాపార వీసాలను ఉపయోగించి దేశంలోకి ప్రవేశిస్తున్నారని అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి క్రిస్టోఫర్ లాండౌ సోమవారం ఆరోపించారు.

వలసల చట్టాలను తప్పించుకునేందుకు ఆశ్రయం ప్రక్రియను ఒక లొసుగుగా ఉపయోగించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇలాంటి విధానాలను అడ్డుకోవాలంటే వీసా తనిఖీలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని లాండౌ పేర్కొన్నారు.

వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా వివరాలను పరిశీలించడం, అవసరమైన సందర్భాల్లో వీసా బాండ్లను విధించడం వంటి చర్యలను కూడా అమలు చేయాల్సి ఉంటుందని సూచించారు.

మొత్తంగా అమెరికాలోకి ప్రవేశించే విదేశీయులపై మరింత కఠినమైన పరిశీలనకు ట్రంప్‌ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ADVERTISEMENT