NATO: అమెరికా కీలక నిర్ణయం.. నాటో,ఐరోపా దేశాల నుంచి అమెరికా బలగాలు వెనక్కి?
ఈ వార్తాకథనం ఏంటి
నాటో కూటమి, ఐరోపా దేశాల నుంచి అమెరికా బలగాలను వెనక్కి తీసుకునే అవకాశాలపై అంతర్జాతీయ వేదికల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. నాటో మిత్రదేశాల వైఖరిపై అసంతృప్తిగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఇరాన్ అంశం, గ్రీన్‌ల్యాండ్ విషయాల్లో ఏర్పడిన విభేదాలే ఈ నిర్ణయానికి కారణమని వైట్‌హౌస్‌కు చెందిన ఉన్నతాధికారి చెప్పినట్లు విదేశీ మీడియా వెల్లడించింది.
వివరాలు
నాటో నుంచి దూరం కావాలనే అంశంపై చర్చలు
నాటో మిత్రదేశాలు హర్మూజ్ జలసంధి మార్గాన్ని తిరిగి ప్రారంభించడంలో సహకరించలేదని అమెరికా భావిస్తోంది. అలాగే గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ యోచన కూడా ముందుకు సాగకపోవడం అసంతృప్తిని మరింత పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో నాటో నుంచి దూరం కావాలనే అంశంపై ట్రంప్ తన సలహాదారులతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉండగా వాషింగ్టన్-ఐరోపా దేశాల మధ్య సంబంధాలు మాత్రం గణనీయంగా దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఇటీవల నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ వాషింగ్టన్ పర్యటన సమయంలోనే ఈ విషయాలు బయటపడ్డాయి. 1949లో ఏర్పాటైన ఈ కూటమి ఉన్నప్పటికీ సభ్య దేశాల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు ఇప్పటివరకు ప్రత్యేక సమావేశం జరగలేదని సమాచారం.
వివరాలు
ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత పరిస్థితి మరింత క్లిష్టం
రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఐరోపా భద్రతను కాపాడేందుకు అమెరికా పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించింది. జర్మనీ,యునైటెడ్ కింగ్‌డమ్,ఇటలీ,స్పెయిన్ వంటి దేశాల్లో ఇప్పటికీ అమెరికా బలగాలు కొనసాగుతున్నాయి. ట్రంప్ అసంతృప్తి కొత్తది కాదని,గత కొన్ని నెలలుగా ఇది పెరుగుతూనే ఉందని తెలుస్తోంది. రక్షణ ఖర్చుల్లో ఐరోపా దేశాలు తగిన భాగస్వామ్యం చూపడం లేదని ఆయన పలుమార్లు విమర్శించారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన హర్మూజ్ జలసంధి మార్గాన్ని తిరిగి ప్రారంభించడంలో నాటో దేశాలు ముందడుగు వేయలేదని అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.