LOADING...
Phelan: యుద్ధ ఉద్రిక్తతల నడుమ అమెరికా కీలక నిర్ణయం.. నేవీ కార్యదర్శి ఫెలాన్ తొలగింపు
యుద్ధ ఉద్రిక్తతల నడుమ అమెరికా కీలక నిర్ణయం.. నేవీ కార్యదర్శి ఫెలాన్ తొలగింపు

Phelan: యుద్ధ ఉద్రిక్తతల నడుమ అమెరికా కీలక నిర్ణయం.. నేవీ కార్యదర్శి ఫెలాన్ తొలగింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2026
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా నేవీ కార్యదర్శి జాన్ ఫెలాన్‌ను హఠాత్తుగా పదవి నుంచి తొలగించారు. ఇరాన్ యుద్ధ విరమణ సమయంలో అమెరికా నేవీ ఇరాన్ పోర్టులపై నిర్బంధ చర్యలు కొనసాగిస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్‌తో నెలలుగా కొనసాగుతున్న విభేదాలే దీనికి కారణంగా తెలుస్తోంది. నౌకా నిర్మాణ సంస్కరణలు నెమ్మదిగా అమలు చేస్తున్నారనే అసంతృప్తి, అలాగే ఫెలాన్ నేరుగా డొనాల్డ్ ట్రంప్‌తో సంప్రదింపులు జరపడం హెగ్‌సెత్‌కు నచ్చలేదని సమాచారం. వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఫెలాన్‌ను తప్పించాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.

వివరాలు 

తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టిన అండర్ సెక్రటరీ హంగ్ కౌ

వెంటనే రాజీనామా చేయాలా లేక తొలగింపును ఎదుర్కొనాలా అని హెగ్‌సెత్ సందేశం పంపినట్టు సమాచారం. అనంతరం ఫెలాన్ పదవి నుంచి తొలగింపునకు గురయ్యారు. ప్రస్తుతం అండర్ సెక్రటరీ హంగ్ కౌ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదే సమయంలో హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకలను అడ్డుకుంటూ అమెరికా దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటివరకు 31 నౌకలను వెనక్కి పంపించగా, రెండు నౌకలను తనిఖీ చేసినట్టు సమాచారం. ఫెలాన్ వ్యాపారవేత్తగా ఉండి సైనిక అనుభవం లేకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.

Advertisement