US: డ్రోన్ల ముప్పుపై అమెరికా కొత్త అస్త్రాలు.. లేజర్, మైక్రోవేవ్ పరీక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా మరింత అధునాతన రక్షణ వ్యవస్థలపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా నాలుగు అత్యాధునిక లేజర్, మైక్రోవేవ్ ఆయుధ వ్యవస్థలను కార్యాచరణ పరీక్షలకు ఎంపిక చేసింది. అమెరికా రక్షణ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ పరీక్షల్లో ఆయుధాల సామర్థ్యం, డ్రోన్లను ఎదుర్కొనే వాటి పనితీరును పరిశీలించనున్నారు. జాయింట్ ఇంటర్‌ఏజెన్సీ టాస్క్‌ఫోర్స్-401 ఈ పరీక్షలను సమన్వయం చేయనుంది. అమెరికా భూభాగంలో చిన్న డ్రోన్ల నుంచి ఎదురయ్యే ముప్పును నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యల్లో ఈ సంస్థ కీలకంగా వ్యవహరిస్తోంది.
వివరాలు
నాలుగు వ్యవస్థలు ఇవే..
పరీక్షల కోసం ఎంపిక చేసిన ఆయుధ వ్యవస్థల్లో ఏరోవైరాన్‌మెంట్ రూపొందించిన 'ప్యాలటైజ్డ్ హై ఎనర్జీ లేజర్', ఎపిరస్‌కు చెందిన 'లియోనిడాస్ హై పవర్డ్ మైక్రోవేవ్', కోర్డ్ రూపొందించిన 'ఫైర్‌ఫ్లై హై ఎనర్జీ లేజర్', బోయింగ్ అభివృద్ధి చేసిన 'కాంపాక్ట్ లేజర్ వెపన్ సిస్టమ్' ఉన్నాయి.
వీటిలో లేజర్ ఆయుధాలు అధిక శక్తిని ఒక నిర్దిష్ట డ్రోన్‌పై కేంద్రీకరించి దాన్ని ధ్వంసం చేసే విధంగా పనిచేస్తాయి.
మరోవైపు మైక్రోవేవ్ ఆయుధాల లక్ష్యం డ్రోన్లలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, పరికరాలను దెబ్బతీయడం. ఈ సాంకేతికతలు అందుబాటులోకి వస్తే డ్రోన్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న సంప్రదాయ క్షిపణులు, తుపాకులకు ప్రత్యామ్నాయ రక్షణ మార్గాలు అందుబాటులోకి రానున్నాయి.
వివరాలు
ఒక్క ఆయుధంతో సరిపోదు..
డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు ఒకే రకమైన ఆయుధ వ్యవస్థపై ఆధారపడటం సరైన విధానం కాదని అమెరికా ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ మాట్ రాస్ పేర్కొన్నారు.
డ్రోన్ల నుంచి వచ్చే ముప్పు స్వభావం, వాటి పరిమాణం, సామర్థ్యాన్ని బట్టి వివిధ రకాల రక్షణ వ్యవస్థలు అవసరమని తెలిపారు.
ఈ క్రమంలో లేజర్, మైక్రోవేవ్ ఆయుధాలు అమెరికా బహుళస్థాయి డ్రోన్ రక్షణ వ్యవస్థలో మరో ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని వివరించారు.
వివరాలు
ఇప్పటికే లేజర్ ఆయుధ పరీక్ష..
అమెరికా ఈ సాంకేతికతను కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉంచలేదు. న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ మిసైల్ రేంజ్‌లో ఇప్పటికే ఒక లేజర్ ఆయుధాన్ని పరీక్షించింది.
ఈ పరీక్ష సమయంలో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ భద్రతా అంశాలను పరిశీలించింది.
ఈ పరీక్ష వల్ల అమెరికా గగనతలానికి ఏర్పడే ముప్పు చాలా తక్కువ స్థాయిలోనే ఉందని అధికారులు నిర్ధారించారు.
డిసెంబరులో మరో కీలక పరీక్ష..
తదుపరి దశలో ఉటాలోని డగ్‌వే ప్రూవింగ్ గ్రౌండ్‌లో డిసెంబరులో మరో కీలక పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ దశలో మరిన్ని లేజర్, మైక్రోవేవ్ ఆయుధ వ్యవస్థలను పరీక్షించే అవకాశం ఉంది.
పరీక్షల ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని అధునాతన వ్యవస్థలను డ్రోన్ వ్యతిరేక రక్షణ చర్యల్లోకి తీసుకురావాలని అమెరికా భావిస్తోంది.