LOADING...
US: రష్యా చమురు కొనుగోలు దేశాలకు అమెరికా షాక్.. 500% సుంకం బిల్లు సిద్ధం
రష్యా చమురు కొనుగోలు దేశాలకు అమెరికా షాక్.. 500% సుంకం బిల్లు సిద్ధం

US: రష్యా చమురు కొనుగోలు దేశాలకు అమెరికా షాక్.. 500% సుంకం బిల్లు సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్న దేశాలకు అమెరికా కఠిన హెచ్చరికలు పంపే దిశగా కీలక చర్యలు చేపడుతోంది. ఇందుకోసం కొత్త ఆంక్షల బిల్లును సిద్ధం చేసింది. ట్రంప్ ప్రభుత్వంతో నలుగురు అమెరికా సెనెటర్లు ఈ బిల్లుపై అవగాహనకు వచ్చినట్లు వెల్లడించారు. రష్యా యుద్ధానికి ఆర్థికంగా సహకరిస్తున్న దేశాలపై మరింత ఒత్తిడి తీసుకురావడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని సెనెటర్లు తెలిపారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువు, యురేనియం, పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న దేశాలను ఈ బిల్లు లక్ష్యంగా చేసుకుంది. అలాంటి దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై గరిష్ఠంగా 500 శాతం వరకు దిగుమతి సుంకం విధించే ప్రతిపాదన ఇందులో ఉంది.

వివరాలు 

రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి

ఈ బిల్లు చట్టంగా మారితే భారత్‌పైనా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. గతంలో కూడా అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహమ్ భారత్, చైనాలను ఉద్దేశించి హెచ్చరికలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తే దాని వల్ల వచ్చే పరిణామాలను ఆయా దేశాలే ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అమెరికా జాతీయ భద్రతకు అవసరమని భావిస్తే, ఏదైనా దేశానికి 180 రోజుల పాటు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే వెసులుబాటును కూడా బిల్లులో పొందుపరిచారు.

వివరాలు 

అమెరికా సెనెట్‌లో ఇప్పటికే 84 మంది సభ్యులు మద్దతు

ఈ ప్రతిపాదనకు అమెరికా సెనెట్‌లో ఇప్పటికే 84 మంది సభ్యులు మద్దతు ప్రకటించినట్లు సమాచారం. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకురావడమే ఈ బిల్లు లక్ష్యమని సెనెటర్లు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇప్పటికే పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిల్లు ఆమోదం పొందితే భారత్ వంటి దేశాల ఇంధన దిగుమతులు, వాణిజ్య కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement