NATO-USA: నాటోకు అమెరికా షాక్.. యుద్ధ విమానాలు,నౌకలకు కత్తెర!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఐరోపా దేశాల మధ్య మరోసారి విభేదాలు ముదిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ యుద్ధం సందర్భంగా తమకు ఆశించిన స్థాయిలో సహకరించని ఐరోపా దేశాల విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నాటో కూటమికి అందిస్తున్న సైనిక సహకారాన్ని తగ్గించే దిశగా ట్రంప్ యంత్రాంగం కీలక ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రణాళిక అమల్లోకి వస్తే ఐరోపాలో నాటో కార్యకలాపాలకు అమెరికా నుంచి అందుతున్న సైనిక మద్దతు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా యుద్ధ విమానాలు,యుద్ధ నౌకల సంఖ్యను కుదించాలని అమెరికా భావిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
వివరాలు
ప్రస్తుతం ఉన్న ఎఫ్-16, ఎఫ్-15 యుద్ధ విమానాల సంఖ్యను తగ్గించే అవకాశం
ఈ నిర్ణయం అమలైతే సుదూర దాడులు, నిఘా కార్యకలాపాలు, వ్యూహాత్మక సైనిక చర్యల్లో నాటో సామర్థ్యాలు పరిమితమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా రూపొందిస్తున్న ప్రణాళిక ప్రకారం ఐరోపాలో మోహరించిన ఎఫ్-16, ఎఫ్-15ఈ యుద్ధ విమానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 150 నుంచి 100కు తగ్గించే అవకాశం ఉంది. అలాగే సముద్ర నిఘా కోసం ఉపయోగించే విమానాల సంఖ్యను 26 నుంచి 15కు కుదించవచ్చని సమాచారం. అంతేకాకుండా ఐరోపాలో అందుబాటులో ఉన్న ఎనిమిది రీఫ్యూయెలింగ్ ట్యాంకర్ విమానాలను కూడా వెనక్కి రప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
అధికారికంగా స్పందించిన అమెరికా రక్షణ శాఖ,నాటో కూటమి
ఇవే కాకుండా జలాంతర్గామి, విమాన వాహక నౌకతో పాటు నాటో కార్యకలాపాల్లో భాగంగా ఉన్న పలు కీలక నౌకలు, విమానాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతంలో మిత్రదేశాల రక్షణ కోసం కేటాయించిన రెండు బాంబర్ గ్రూపుల్లో ఒకదాని మోహరింపును కూడా మార్చే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అమెరికా రక్షణ శాఖ కానీ, నాటో కూటమి కానీ అధికారికంగా స్పందించలేదు. మరోవైపు నాటోకు అందించే సైనిక సహకారంలో మార్పులు, సర్దుబాట్లు చేయనున్నట్లు గత వారం యూఎస్ ఈస్టర్న్ కమాండ్ ప్రకటించిన నేపథ్యంలో ఈ కథనాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
వివరాలు
నాటో కూటమిపై పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసిన ట్రంప్
ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచేందుకు అమెరికాతో కలిసి పనిచేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఐరోపా దేశాలను కోరినా ఆశించిన స్పందన రాలేదని సమాచారం. దీంతో అసంతృప్తికి గురైన ట్రంప్.. నాటో కూటమిపై పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఆ కూటమి నుంచి అమెరికా వైదొలిగే అవకాశాన్ని కూడా ప్రస్తావించారు. అంతేకాకుండా నాటోను "కాగితపు పులి"గా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.