Washington Wildfires: వాషింగ్టన్‌ను వణికిస్తున్న కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో కార్చిచ్చు తీవ్రరూపం దాల్చి విస్తృతంగా వ్యాపిస్తోంది. అటవీ ప్రాంతాల్లో చెలరేగిన మంటలు వేగంగా విస్తరిస్తుండటంతో సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే వేలాది మందిని తరలించిన అధికారులు, తాజాగా మరో 60 వేల మందిని తాత్కాలిక సహాయ శిబిరాలకు పంపించారు. కార్చిచ్చుకు కారణమై ఉండొచ్చన్న అనుమానంతో స్పోకేన్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో మంటలు వ్యాపించగా, వందల సంఖ్యలో భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ముఖ్యంగా స్పోకేన్ ప్రాంతంలో మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది నిరంతరం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
వివరాలు
వాషింగ్టన్‌లో అత్యవసర పరిస్థితి
అయితే బలమైన గాలులు, పొడి వాతావరణం కారణంగా మంటలను అదుపు చేయడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది.
కార్చిచ్చు వల్ల జరిగిన నష్టం ఎంత మేరకు ఉందో అంచనా వేస్తున్నామని స్పోకేన్ మేయర్ లీసా బ్రౌన్ తెలిపారు.
కార్చిచ్చు పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించిన అనంతరం వాషింగ్టన్ రాష్ట్ర గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
మంటలు వేగంగా వ్యాపిస్తున్న ప్రాంతాల్లో ప్రజలను ఇళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా, ఈ వారం ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
వివరాలు
డ్రోన్ల ఎగరవేతపై నిషేధం
కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల ఎగరవేతపై పూర్తిస్థాయి నిషేధం విధించినట్లు అధికారులు ప్రకటించారు.
నిషేధాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డ్రోన్లు ఎగరడం వల్ల అగ్నిమాపక విమానాలు, హెలికాప్టర్లు నిర్వహిస్తున్న సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు.
ముఖ్యంగా ఆదివారం ఒక్కరోజే డ్రోన్ల కారణంగా 26 సార్లు అగ్నిమాపక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు.