US sanctions: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు మద్దతు.. భారత కంపెనీపై అమెరికా ఆంక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్ విమానయాన సంస్థకు సహకారం అందిస్తున్నాయనే ఆరోపణలతో అమెరికా మరోసారి కఠిన చర్యలు చేపట్టింది. భారత్‌కు చెందిన ఒక సంస్థతో పాటు మొత్తం ఆరు సంస్థలు,వ్యక్తులపై అమెరికా ట్రెజరీ విభాగం గురువారం ఆంక్షలు విధించింది. ఈ సంస్థలు,వ్యక్తులు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కార్యకలాపాలకు పరోక్షంగా మద్దతు అందిస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. అమెరికా ట్రెజరీ విభాగం వివరాల ప్రకారం,ఆంక్షలకు గురైన సంస్థలు మహాన్ ఎయిర్‌కు జనరల్ సేల్స్ ఏజెంట్లుగా (జీఎస్ఏ) సేవలు అందిస్తున్నాయి. చాలాకాలంగా మహాన్ ఎయిర్ ఐఆర్‌జీసీకి సిబ్బంది,ఆయుధాలు,డ్రోన్ వ్యవస్థలను తరలించడంలో కీలక పాత్ర పోషిస్తోందని వాషింగ్టన్ పేర్కొంది.
వివరాలు
2020 నుంచి మహాన్ ఎయిర్‌కు ఏజెంట్‌గా స్కైజ్ ట్రావెల్స్
అందువల్ల ఆ సంస్థకు ఆర్థిక, లాజిస్టిక్స్ లేదా వాణిజ్య పరంగా సహకారం అందిస్తున్న వారందరూ ఒక ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలకు బలం చేకూరుస్తున్నట్లేనని అమెరికా అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ,ఐఆర్‌జీసీ లేదా మహాన్ ఎయిర్‌కు ఎలాంటి ఆర్థిక, వాణిజ్య, రవాణా సంబంధిత సహకారం అందించినా అది ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా పరిగణిస్తామని తెలిపారు.
అలాంటి సంస్థలు,వ్యక్తులను గుర్తించి అమెరికా ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉంచేందుకు చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఆంక్షల జాబితాలో భారత్‌కు చెందిన స్కైజ్ ట్రావెల్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా చోటు దక్కించుకుంది.
ఈ సంస్థ 2020 నుంచి మహాన్ ఎయిర్‌కు ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని అమెరికా ట్రెజరీ వెల్లడించింది.
వివరాలు
ఉగ్రవాద సంస్థకు సాయపడేవారిని వదిలిపెట్టబోమన్న అమెరికా ట్రెజరీ
అలాగే ఈ సంస్థకు ఢిల్లీ, శ్రీనగర్‌లలో కార్యాలయాలు ఉన్నట్లు పేర్కొంది.
భారత సంస్థతో పాటు చైనాకు చెందిన షాంఘై వింగ్స్ ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్, షాంఘై ఎలైట్ ఇంటర్నేషనల్ ట్రావెల్,రష్యాకు చెందిన ఎయిర్ కార్గో ప్రో లిమిటెడ్, అలాగే షాంఘై వింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ టాంగ్ జిన్పై కూడా అమెరికా ఆంక్షలు అమలు చేసింది.
ఇదిలా ఉండగా, ఐఆర్‌జీసీతో అనుబంధంగా పనిచేస్తున్న డేడ్‌నెగర్ స్టార్టప్ స్టూడియో అనే సంస్థపైనా అమెరికా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది.
ఈ సంస్థ పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ సైనిక పరికరాల స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, ఇరాన్ సైనిక చర్యలకు సహకరిస్తోందని అమెరికా ఆరోపించింది.
ఈ నేపథ్యంలో ఆ సంస్థను కూడా ఆంక్షల పరిధిలోకి తీసుకువచ్చినట్లు ట్రెజరీ విభాగం వెల్లడించింది.