Trump: ట్రంప్ దూకుడుకు అమెరికా సెనెట్ బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్'కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై ఆయన అనుసరిస్తున్న దూకుడు వైఖరికి అమెరికా సెనెట్ కళ్లెం వేసింది. అధ్యక్షుడి యుద్ధ అధికారాలను పరిమితం చేసే తీర్మానానికి సెనెట్‌లో ఆమోదం లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఫిబ్రవరి చివర్లో ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా, ఇరాన్‌పై సైనిక చర్యలు ప్రారంభించింది. అప్పటి నుంచి యుద్ధానికి సంబంధించిన అధికారాలను నియంత్రించాలంటూ ప్రతిపక్ష డెమోక్రటిక్ సభ్యులు పలుమార్లు సెనెట్‌లో తీర్మానాలు ప్రవేశపెట్టారు. అయితే, వాటికి తగిన మద్దతు దక్కలేదు.
వివరాలు
47 మంది వ్యతిరేకంగా ఓటు
ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన సెనెటర్ Tim Kaine మరోసారి కొత్త తీర్మానాన్ని సెనెట్ ముందుకు తీసుకొచ్చారు. కాంగ్రెస్ స్పష్టమైన అనుమతి లేకుండా ఇరాన్‌లో గానీ, ఇరాన్‌కు వ్యతిరేకంగా గానీ జరిగే ఘర్షణల్లో అమెరికా సైన్యం పాల్గొనరాదని అందులో పేర్కొన్నారు. ఈ తీర్మానానికి 50 మంది సభ్యులు మద్దతు తెలపగా.. 47 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ముఖ్యంగా అధికార రిపబ్లికన్ పార్టీకే చెందిన నలుగురు సభ్యులు కూడా తీర్మానానికి అనుకూలంగా ఓటేయడం చర్చనీయాంశమైంది. త్వరలో ఈ బిల్లుపై తుది ఓటింగ్ జరగనుంది. అది చట్టంగా మారితే.. కాంగ్రెస్ అధికారిక అనుమతి ఇచ్చే వరకు ట్రంప్ ఇరాన్‌పై ఎలాంటి సైనిక దాడులకు ఆదేశాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడనుంది.
వివరాలు
Chuck Schumer తీవ్ర వ్యాఖ్యలు
ఓటింగ్ సందర్భంగా డెమోక్రటిక్ పార్టీ సెనెట్ నేత Chuck Schumer తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలపై కాంగ్రెస్ తిరిగి పర్యవేక్షణ చేపట్టాలన్నారు. 'ఈ అధ్యక్షుడు నిండుగా తూటాలు ఉన్న తుపాకీతో ఆడుతున్న చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారు' అంటూ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.