Loading...
Donald Trump: భారత్‌ సహా 5 దేశాలపై 100% టారిఫ్‌.. బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం
భారత్‌ సహా 5 దేశాలపై 100% టారిఫ్‌.. బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం

Donald Trump: భారత్‌ సహా 5 దేశాలపై 100% టారిఫ్‌.. బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 09, 2026
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాను, ఆ దేశం నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న దేశాలను శిక్షించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కీలక బిల్లుకు అమెరికా సెనెట్‌ ఆమోదం తెలిపింది. రష్యా నుంచి భారత్‌, చైనా వంటి దేశాలు ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో.. పరోక్షంగా ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధానికి అవి మద్దతు ఇస్తున్నట్లుగా అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలపై కఠిన చర్యలు తీసుకునేలా బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా నుంచి చమురు, సహా ఇతర ఇంధన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న అగ్రశ్రేణి ఐదు దేశాలపై 100శాతం టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు లభిస్తుంది. ఈ జాబితాలో చైనా, భారత్‌, అజర్‌బైజాన్‌, హంగరీ, స్లొవేకియా ఉన్నాయి.

వివరాలు

భారత్‌, చైనా వంటి దేశాలపై అమెరికా అదనపు టారిఫ్‌లు

రష్యాపై ఒత్తిడి పెంచడంతో పాటు.. ఆ దేశంతో ఇంధన వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలను కూడా లక్ష్యంగా చేసుకోవడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

దీంతో రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్న భారత్‌, చైనా వంటి దేశాలపై అమెరికా అదనపు టారిఫ్‌లు విధించే అవకాశం ఏర్పడనుంది.

మరోవైపు ఇరాన్‌ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలపై ఆంక్షలు విధించే చట్టాన్ని పొడిగించడం కూడా తాజా బిల్లులోని ముఖ్య ఉద్దేశాల్లో ఒకటిగా ఉంది.

సెనెట్‌ ఆమోదించిన ఈ బిల్లుపై అమెరికా ప్రతినిధుల సభ ఈ నెల 31న నిర్ణయం తీసుకోనుంది. అక్కడ కూడా ఆమోదం లభించిన అనంతరం తదుపరి ప్రక్రియ కొనసాగనుంది.

ADVERTISEMENT