Loading...
Data Theft : డేటా చోరీ ఆరోపణలు.. మూడు భారత కంపెనీలపై చర్యలకు అమెరికా డిమాండ్
డేటా చోరీ ఆరోపణలు.. మూడు భారత కంపెనీలపై చర్యలకు అమెరికా డిమాండ్

Data Theft : డేటా చోరీ ఆరోపణలు.. మూడు భారత కంపెనీలపై చర్యలకు అమెరికా డిమాండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేలాది మంది అమెరికన్లు, పలు సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని మూడు భారతీయ కంపెనీలు అక్రమంగా సేకరించి చోరీ చేశాయని ఆరోపిస్తూ.. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా సెనేటర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు డెమోక్రటిక్ పార్టీకి చెందిన రాన్ వైడెన్,షెల్డన్ వైట్‌హౌస్,రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ప్యాట్ హారిగన్.. అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్‌కు లేఖ రాశారు. సన్‌కిస్డ్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్,బెల్‌ట్రాక్స్ లిమిటెడ్,సైబర్‌రూట్ లిమిటెడ్‌లపై చర్యలు తీసుకోవాలని సెనేటర్లు తమ లేఖలో కోరారు. ఈ మూడు సంస్థలకు అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్,క్లౌడ్ మౌలిక వసతులు,సైబర్‌ సెక్యూరిటీ సాధనాలు అందకుండా వాటిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కంపెనీలు 15ఏళ్లకు పైగా డేటా చోరీ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని వారు ఆరోపించారు.

వివరాలు 

భారీ స్థాయిలో డేటా హ్యాకింగ్

ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, ఔషధ తయారీ కంపెనీలు, ప్రముఖ న్యాయ సంస్థలకు చెందిన 1,000 మందికిపైగా న్యాయవాదులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో డేటా హ్యాకింగ్‌కు పాల్పడ్డారని సెనేటర్లు పేర్కొన్నారు.

అంతేకాకుండా ఖతార్‌లో ఫిఫా ప్రపంచకప్ నిర్వహణకు సంబంధించిన ప్రయత్నాలను వ్యతిరేకించిన వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు.

అమెరికా ప్రతినిధుల సభకు చెందిన మాజీ సీనియర్ నేత కుటుంబ సభ్యులను సైతం ఈ సంస్థలు టార్గెట్ చేశాయని సెనేటర్లు ఆరోపించారు.

తమపై వస్తున్న వార్తా కథనాలను అడ్డుకునేందుకు విదేశీ న్యాయస్థానాలను ఉపయోగించుకున్నట్లు కూడా లేఖలో పేర్కొన్నారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో సంబంధిత భారతీయ కంపెనీలపై చర్యలు తీసుకోవడంతో పాటు.. అమెరికా సాంకేతిక వనరులకు వాటి ప్రాప్యతను నిలిపివేయాలని సెనేటర్లు కోరారు.

ADVERTISEMENT