LOADING...
US Strikes: క్రైస్తవులపై హింసకు చెక్‌.. నైజీరియాలో ఐసిస్‌ లక్ష్యంగా యూఎస్‌ స్ట్రైక్స్
క్రైస్తవులపై హింసకు చెక్‌.. నైజీరియాలో ఐసిస్‌ లక్ష్యంగా యూఎస్‌ స్ట్రైక్స్

US Strikes: క్రైస్తవులపై హింసకు చెక్‌.. నైజీరియాలో ఐసిస్‌ లక్ష్యంగా యూఎస్‌ స్ట్రైక్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

నైజీరియాలో ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అమెరికా భారీ స్థాయిలో దాడులు ప్రారంభించింది. ఆ దేశంలో క్రైస్తవులపై కొనసాగుతున్న హింసను అరికట్టే ఉద్దేశంతోనే ఈ సైనిక చర్యలు చేపట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్రూత్‌ సోషల్‌ వేదికగా చేసిన పోస్టులో వెల్లడించారు. 'నైజీరియాలో ఐసిస్‌ ఉగ్రవాదులపై యునైటెడ్‌ స్టేట్స్‌ శక్తిమంతమైన దాడులు ప్రారంభించింది. అమాయకులైన క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని నిర్దాక్షిణ్యంగా హత్యలు చేస్తున్న వారిపైనే ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ ఊచకోతలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గతంలోనే హెచ్చరించాను. అయితే, నా హెచ్చరికలను వారు పట్టించుకోలేదు.

Details

ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిల్లోనూ సహించం

ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు. రాడికల్‌ ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులతో సహా అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. క్రైస్తవులపై హింస కొనసాగితే అమెరికా దాడులు కూడా కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకే ఈ దాడులు నిర్వహించామని, ఇందులో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారని అమెరికా సైన్యానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు. నైజీరియా గత కొన్నేళ్లుగా ఐసిస్‌కు అనుబంధంగా ఉన్న తీవ్రవాద వర్గాలు, అలాగే బోకో హరామ్‌ అనే ఉగ్రవాద సంస్థ కారణంగా తీవ్ర భద్రతా సమస్యలను ఎదుర్కొంటోంది.

Details

ప్రత్యేక ఆందోళనకర దేశాల జాబితాలో నైజీరియా

క్రైస్తవులపై జరుగుతున్న హింస నేపథ్యంలో, 2020లో అమెరికా తొలిసారిగా నైజీరియాను 'ప్రత్యేక ఆందోళనకర దేశాల' జాబితాలో చేర్చింది. ఈ పరిస్థితుల దృష్ట్యా, నైజీరియాలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సైనిక చర్యలకు ప్రణాళిక రూపొందించాలని పెంటగాన్‌ను ఆదేశించినట్లు ట్రంప్‌ నవంబర్‌లోనే ప్రకటించారు. ఆ ప్రణాళికలో భాగంగానే తాజాగా ఈ దాడులు జరిగినట్లు స్పష్టమవుతోంది.

Advertisement