Loading...
USA: అమెరికా స్టూడెంట్‌ వీసాల్లో 39 శాతం తగ్గుదల.. 2020 తర్వాత ఇదే అత్యల్పం
USA: అమెరికా స్టూడెంట్‌ వీసాల్లో 39 శాతం తగ్గుదల..

USA: అమెరికా స్టూడెంట్‌ వీసాల్లో 39 శాతం తగ్గుదల.. 2020 తర్వాత ఇదే అత్యల్పం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలసలపై కఠిన ఆంక్షలు విధించడం, అరెస్టులు, దేశం నుంచి బహిష్కరణ చర్యలు చేపట్టడం వంటి పరిణామాలు విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో అమెరికాకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న భారతీయ విద్యార్థులు తమ నిర్ణయాలను పునఃపరిశీలించుకుంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో ఎఫ్‌, ఎం కేటగిరీ స్టూడెంట్ వీసాలపై భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య 39 శాతం తగ్గింది. సాధారణంగా అమెరికాలో ఫాల్ సెమిస్టర్ ప్రారంభానికి ముందు విదేశీ విద్యార్థుల చేరిక ఎక్కువగా ఉండే ఆగస్టులోనే ఈ తగ్గుదల నమోదవడం గమనార్హం.

వివరాలు 

ఆగస్టు నెలలో నమోదైన అత్యల్ప సంఖ్య ఇదే..

అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ (ITA)వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో ఎఫ్‌,ఎం కేటగిరీ వీసాలపై అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 25,321గా నమోదైంది.

గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 41,540గా ఉంది.కరోనా మహమ్మారి కారణంగా 2020లో ప్రయాణ ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య కేవలం 2,908కు పరిమితమైంది.

ఆ తర్వాత ఆగస్టు నెలలో నమోదైన అత్యల్ప సంఖ్య ఇదేనని నివేదికలు పేర్కొన్నాయి.

జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ భారతీయ విద్యార్థుల సంఖ్య కొంత తగ్గింది.

అయితే ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ క్షీణత మరింత వేగంగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

వివరాలు 

ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు

వీసా నిబంధనల్లో కఠినతరం, చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు లభిస్తాయా లేదా అనే అనిశ్చితి, సోషల్ మీడియా ఖాతాల పరిశీలన వంటి అంశాలు ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

వీటితో పాటు వీసాల తిరస్కరణ రేటు పెరగడం, ఉపాధి అవకాశాలపై సందేహాలు, అమెరికాలో విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చులు పెరుగుతుండటం కూడా విద్యార్థుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులు తమ విదేశీ విద్య ప్రణాళికలను మరోసారి పరిశీలించుకుంటున్నారని ఎడ్యువెలాసిటీ గ్లోబల్ మేనేజింగ్ పార్టనర్ కన్సల్టెంట్ పేర్కొన్నారు.

ADVERTISEMENT