
US student visa: అమెరికా చదువులకు భారీగా తగ్గిన విద్యార్థి వీసాలు.. ఎందుకంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ సంవత్సరం అమెరికాలో విద్యను అభ్యసించాలనే ఆశతో ముందుకు వచ్చిన భారతీయ విద్యార్థులకు నిరాశ ఎదురవుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే, 2024లో సీజన్ ప్రారంభ దశలో చాలా తక్కువ సంఖ్యలోనే వీసాలు జారీ కావడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా విదేశాంగశాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, 2023 మార్చి-మే కాలంతో పోల్చితే ఈ ఏడాది ఇదే సమయంలో విద్యార్థి వీసాల జారీ 27 శాతం మేర తగ్గినట్లు తెలుస్తోంది. విశేషమేంటంటే, కోవిడ్ మహమ్మారి ప్రభావం ఉన్న కాలంలోనికంటే కూడా ఈ ఏడాది వీసాల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం.
వివరాలు
అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులలో అగ్రస్థానంలో భారతీయులు
సాధారణంగా, అమెరికాలో ఆగస్ట్/సెప్టెంబర్ మధ్య కాలంలో కొత్త సెమిస్టర్ ప్రారంభమయ్యే నేపథ్యంలో, మార్చి నుంచి జులై మధ్య వీసాల జారీ సీజన్ అత్యంత రద్దీగా ఉంటుంది. కానీ, ఈసారి మాత్రం మార్చి-మే మధ్య కాలంలో భారతీయ విద్యార్థులకు కేవలం 9,906 ఎఫ్-1 వీసాలు మాత్రమే మంజూరయ్యాయి. 2022లో ఇదే సమయంలో 10,894, 2023లో 14,987, 2024లో 13,478 వీసాలు జారీ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, 2023-2024 విద్యాసంవత్సరానికి అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులలో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు. గతానికి భిన్నంగా, ఈ స్థానం గతంలో చైనాకు చెందింది. అయితే ఇప్పుడు భారత విద్యార్థుల సంఖ్య చైనాను మించిందని ఓపెన్ డోర్స్-2024 నివేదిక వెల్లడించింది.
వివరాలు
విదేశీ విద్యార్థులపై రాజకీయ పరిణామాలు
ఇక అమెరికాలో విదేశీ విద్యార్థులపై రాజకీయ పరిణామాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వ నిబంధనల కఠినతరం, పలస్తీనా మద్దతుగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల వీసాల రద్దు వంటి పరిణామాలు భారత విద్యార్థులను కూడా ప్రభావితం చేశాయి. ప్రత్యేకంగా, వీసా ప్రక్రియలో సోషల్ మీడియా వెట్టింగ్ అనే కఠినమైన దశను మే 27 నుంచి జూన్ 18 వరకు అమలు చేయడంతో, ఈ కాలంలో రెండు వారాలపాటు వీసా అప్లికేషన్ల స్వీకరణను నిలిపివేయడం వీసాల సంఖ్య తగ్గడానికి ముఖ్య కారణమైంది.
వివరాలు
వీలైనంత తర్వగా దరఖాస్తు చేసుకోండి: అమెరికా
తాజాగా అమెరికా దౌత్యశాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో మాట్లాడుతూ .. "వీసాల జారీ ప్రక్రియలో జాతీయ భద్రత, పౌరుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అభ్యర్థులు వీలైనంత త్వరగా వీసా దరఖాస్తులు దాఖలు చేయాలని సూచిస్తున్నాం. విదేశీ దౌత్య కార్యాలయాలు నాన్-ఇమిగ్రెంట్ వీసాల అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడం ప్రారంభించాయి. అభ్యర్థులు తమకు సమీపంలోని కార్యాలయాల్లో అపాయింట్‌మెంట్లు వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవాలి. దరఖాస్తుదారులు అమెరికాకు భద్రతాపరంగా హానికరులు కాదనే విషయాన్ని నిరూపించేందుకు అవసరమైన వెట్టింగ్ ప్రక్రియను పూర్తిగా అమలు చేస్తున్నాం" అని వివరించారు.