US BIRTHRIGHT CITIZENSHIP: జన్మతః పౌరసత్వంపై సుప్రీంకోర్టు తీర్పు.. ఇండో అమెరికన్ల ఆనందం
ఈ వార్తాకథనం ఏంటి
విదేశీ వలస కుటుంబాల పిల్లల జన్మతః పౌరసత్వాన్ని పరిరక్షిస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై భారతీయ అమెరికన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విదేశీయుల పిల్లలకు జన్మతః పౌరసత్వం కల్పించకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు ప్రకారం అక్రమ వలసదారులు లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలు అక్కడ జన్మిస్తే, వారికి అమెరికా పౌరుల హోదానే వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని ఇండో-అమెరికన్ సమాజం స్వాగతించింది. ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చింతన్ పటేల్ మాట్లాడుతూ, ఈ తీర్పు అమెరికాలో నివసిస్తున్న వలస కుటుంబాలకు గొప్ప భరోసా కల్పించిందన్నారు.
వివరాలు
12లక్షల మందికిపైగా ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు కోసం ఎదురుచూపులు
ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రభావం ప్రధానంగా భారతీయులు, ఇతర దక్షిణాసియా వలస కుటుంబాలపైనే పడేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చారిత్రాత్మక విజయమని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ బుటోరియా అభివర్ణించారు. మరోవైపు, ఎఫ్‌ఐఐడీఎస్ అధ్యక్షుడు ఖండేరావ్ కంద్ మాట్లాడుతూ,అమెరికాలోని సుమారు 52లక్షల ఇండో-అమెరికన్లలో 12లక్షల మందికిపైగా ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. తాజా అంచనాల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో 6 నుంచి 7 లక్షల మంది హెచ్-1బీ వీసాదారులు ఉన్నారు. వీరిలో 70శాతానికి పైగా భారతీయులే. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో హెచ్-1బీ వీసాపై ఉన్న కుటుంబాలకు గణనీయమైన ఊరట లభించనుందని ఇండో-అమెరికన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.