US Army: యుద్ధ సన్నాహాల్లో అమెరికా.. సామూహిక ఖనన స్థలాల ఏర్పాటుపై శిక్షణ.. ఇరాన్ యుద్ధం కోసమేనా?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా సైన్యం సామూహిక సమాధుల (Mass Graves) ఏర్పాటుపై తమ సైనికులకు శిక్షణ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యుద్ధంలో పెద్ద సంఖ్యలో సైనికులు మరణించినప్పుడు వారి మృతదేహాలను గుర్తించడం, గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడం, మృతదేహాలను భద్రపరచడం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ శిక్షణలో భాగంగా బుల్డోజర్లు,ఇతర భారీ యంత్రాలను ఉపయోగించి తాత్కాలిక ఖనన స్థలాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. యుద్ధరంగంలో మరణించిన అమెరికా సైనికుల మృతదేహాలను గుర్తించి,వాటిని భద్రపరిచి సురక్షితంగా స్వదేశానికి తరలించే విధానాలపైనా సైనికులకు అవగాహన కల్పిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. 1950-53 మధ్య జరిగిన కొరియా యుద్ధం తర్వాత అమెరికా సైన్యం ఇలాంటి కసరత్తులు చేపట్టడం ఇదే తొలిసారని మీడియా వర్గాలు తెలిపాయి.
వివరాలు
2 వేలకు పైగా మృతదేహాలను ఖననం చేసేలా ఏర్పాట్లు
ఆ యుద్ధంలో 36,515 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 7,245 మంది శత్రు దేశానికి బందీలుగా చిక్కుకున్నట్లు వెల్లడించాయి.
యుద్ధంలో భారీ సంఖ్యలో సైనికులు మరణిస్తే ప్రతి ఒక్కరికీ విడివిడిగా అంత్యక్రియలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు.
ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సామూహిక ఖనన స్థలాలను సిద్ధం చేస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఒక్కో ప్రదేశంలో సుమారు 100 మృతదేహాలను ఖననం చేసేందుకు వీలుగా భారీ సమాధులను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
మొత్తంగా 2 వేల మందికి పైగా మృతదేహాలను ఖననం చేయగలిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ కథనాలు వెల్లడించాయి.
అయితే ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
వివరాలు
ఇరాన్‌పై దాడుల వార్తల నేపథ్యంలో చర్చ
ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నాయనే వార్తల నేపథ్యంలో ఈ సామూహిక సమాధుల ఏర్పాట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ పరిణామాలు యుద్ధంలో అమెరికా సైనికులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందనే చర్చకు దారితీస్తున్నాయి.
ఇరాన్‌తో నెలల తరబడి కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా సైనికుల్లో కనీసం 22 మంది మరణించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
ఈ విషయాన్ని కొందరు సైనికాధికారులు కూడా ధ్రువీకరించినట్లు కథనాలు పేర్కొన్నాయి.
అయితే సైనికుల మరణాలకు సంబంధించి వెలువడుతున్న నివేదికలను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తోసిపుచ్చారు.
దీంతో ఒకవైపు సామూహిక ఖనన ఏర్పాట్లపై వార్తలు, మరోవైపు సైనికుల మరణాలపై భిన్నమైన ప్రకటనలు చర్చనీయాంశంగా మారాయి.