Trump: యుద్ధ పరిస్థితుల్లో మారిన లెక్కలు.. ఉక్రెయిన్ డ్రోన్ టెక్నాలజీ కోసం అమెరికా ప్రయత్నాలు
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు ఏడు నెలల క్రితం అమెరికాకు ఒక అరుదైన రక్షణ సాంకేతికతను అందించేందుకు ఉక్రెయిన్ ముందుకొచ్చింది. అయితే ఆ సమయంలో కీవ్ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేసిన ట్రంప్ ప్రభుత్వం ఆ ఆఫర్‌ను పెద్దగా పట్టించుకోలేదు. 'మాకు అవసరం లేదు' అన్నట్టుగా తిరస్కరించింది. కానీ ఇప్పుడు అదే నిర్ణయం అమెరికాకు సమస్యగా మారింది. పరిస్థితులు మారడంతో ఇరాన్ తయారు చేసిన చౌక షాహెద్ డ్రోన్లను ఎదుర్కొనేందుకు మళ్లీ ఉక్రెయిన్ సహాయాన్ని కోరాల్సిన పరిస్థితి అమెరికాకు ఏర్పడింది.
వివరాలు
స్వయంగా ట్రంప్‌కు జెలెన్‌స్కీ ప్రతిపాదన
పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరాన్ షాహెద్ డ్రోన్లు అమెరికా, ఇజ్రాయెల్‌కు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ డ్రోన్లను అడ్డుకునే ప్రత్యేక సాంకేతికతను ఉక్రెయిన్ చాలా కాలం క్రితమే అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఇంటర్‌సెప్టర్ డ్రోన్ టెక్నాలజీని అమెరికాకు అందించేందుకు ఉక్రెయిన్ గతంలో ముందుకొచ్చింది. యాక్సియోస్ ప్రచురించిన తాజా కథనం ప్రకారం, గత సంవత్సరం ఆగస్టులో వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ ప్రతిపాదనను వివరించారు. ఇరాన్ డ్రోన్ల కారణంగా పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉందని కూడా ఆయన వివరించినట్లు సమాచారం.
వివరాలు
జెలెన్‌స్కీపై కొంత అనుమానం ఉండటంతో ఆ ఆఫర్ తిరస్కారం
ఆ తర్వాత ఈ సాంకేతికతపై ఉక్రెయిన్ అధికారులు అమెరికా సైన్యానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు కూడా అందించారు. ఇరాన్ డ్రోన్లను ఎదుర్కొనేందుకు తుర్కియే,జోర్డాన్,పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో డ్రోన్ కాంబాట్ హబ్‌లను ఏర్పాటు చేయాలని కూడా కీవ్ ప్రతిపాదించింది. జెలెన్‌స్కీతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై తమ బృందం పని చేస్తుందని ట్రంప్ చెప్పినా,ఆ తర్వాత అమెరికా నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై ఒక అమెరికా అధికారి మాట్లాడుతూ,జెలెన్‌స్కీపై కొంత అనుమానం ఉండటంతో ఆ ఆఫర్‌ను తిరస్కరించి ఉండవచ్చని తెలిపారు. అయితే ఇరాన్‌తో సంబంధమైన పరిస్థితుల్లో తమ పెద్ద వ్యూహాత్మక తప్పిదం ఏదైనా ఉందంటే, ఉక్రెయిన్ సాంకేతికతను స్వీకరించకపోవడమే అని ఆయన పేర్కొన్నట్లు యాక్సియోస్ వెల్లడించింది.
వివరాలు
ఇంటర్‌సెప్టర్ డ్రోన్ టెక్నాలజీపై చర్చలు
ఆ సమయంలో అమెరికా చేసిన అంచనాలు తప్పడంతో ఇప్పుడు పశ్చిమాసియాలో భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, గత వారం అమెరికా అధికారులు అధికారికంగా ఉక్రెయిన్‌ను సంప్రదించి ఆ ఇంటర్‌సెప్టర్ డ్రోన్ టెక్నాలజీపై చర్చలు ప్రారంభించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇటీవల జెలెన్‌స్కీ కూడా స్పందిస్తూ, అమెరికా కోరితే ఆ సాంకేతికతను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
వివరాలు
రష్యా దాడుల నేపథ్యంలో కీవ్ అభివృద్ధి
ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్లకు సంబంధించిన విడి భాగాలను రష్యా ఇప్పటికే కొనుగోలు చేసింది. వాటిని తమ దేశంలో అసెంబుల్ చేసి 'గెరాన్-2' పేరుతో ఉక్రెయిన్‌పై దాడుల్లో ఉపయోగిస్తోంది. ఈ దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సొంతంగా ఇంటర్‌సెప్టర్ డ్రోన్లను అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్లు సెన్సర్లు,ఇతర వైమానిక రక్షణ వ్యవస్థలతో అనుసంధానంగా పనిచేసేలా రూపకల్పన చేశారు. వీటికి వార్‌హెడ్ అమర్చుకుని ప్రయోగించవచ్చు. అంతేకాకుండా చిన్న బ్యాగులో తీసుకెళ్లేంత సౌకర్యం కూడా వీటికి ఉంది. నైట్ విజన్ పరికరాలు అమర్చడంతో రాత్రి సమయంలో కూడా శత్రు డ్రోన్లను గుర్తించి అడ్డుకునే సామర్థ్యం వీటికి ఉంది.
వివరాలు
ఏమిటి షాహెద్ డ్రోన్లు?
షాహెద్-136 ఒక వన్‌వే అటాక్ డ్రోన్. ఇది చిన్న క్రూయిజ్ మిస్సైల్‌లా పనిచేస్తుంది. లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోతుంది. అందుకే వీటిని సాధారణంగా 'ఆత్మాహుతి డ్రోన్లు'గా కూడా పిలుస్తారు. ఒక్కో డ్రోన్ తయారీ ఖర్చు సుమారు 20 వేల డాలర్లు, అంటే దాదాపు రూ.16 లక్షలు. అయితే వీటిని అడ్డుకునేందుకు అమెరికా పేట్రియాట్ వంటి అత్యంత ఖరీదైన క్షిపణులను వినియోగించాల్సి వస్తోంది.
వివరాలు
ఏమిటి షాహెద్ డ్రోన్లు?
వాటి ధర కోట్ల రూపాయలు ఉండటంతో రక్షణ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే ఈ ఖరీదైన మిస్సైళ్ల నిల్వలు త్వరగా తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అభివృద్ధి చేసిన ఇంటర్‌సెప్టర్ డ్రోన్ సాంకేతికత అమెరికా రక్షణ వ్యవస్థపై పడే ఆర్థిక భారం కొంత వరకు తగ్గించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.