Loading...
US Iran sanctions : ఆర్థికంగా ఇరాన్‌ను ఒంటరి చేయడమే లక్ష్యం.. అమెరికా కొత్త వ్యూహం ఇదే
ఆర్థికంగా ఇరాన్‌ను ఒంటరి చేయడమే లక్ష్యం.. అమెరికా కొత్త వ్యూహం ఇదే

US Iran sanctions : ఆర్థికంగా ఇరాన్‌ను ఒంటరి చేయడమే లక్ష్యం.. అమెరికా కొత్త వ్యూహం ఇదే

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2026
08:02 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా ప్రభుత్వం తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరకపోవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలపైనా కఠిన చర్యలు తప్పవని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్‌పై తాము చేపట్టిన చర్యలు చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన ఆర్థిక దాడిగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అభివర్ణించారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలు, సంస్థలపై కఠినమైన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. సైనిక చర్యకు వెళ్లకుండా కేవలం ఆర్థిక ఒత్తిడితోనే ఇరాన్ ప్రభుత్వాన్ని దారిలోకి తీసుకురావాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. ఆక్జియోస్ నివేదిక ఈ ప్రణాళికను 'ఎకనామిక్ డీ-డే'గా పేర్కొంది.

వివరాలు 

ద్వితీయ ఆంక్షల విస్తరణ..

ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న ఇతర దేశాలు, కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకునేలా తాజా ఆంక్షలను విస్తరిస్తున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.

నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల వరకు ఇరాన్‌పై ప్రధాన ఒత్తిడి సాధనంగా ఈ ఆంక్షలే కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి సైనిక చర్యకు వెళ్లే అవకాశాన్ని కూడా అమెరికా పరిశీలించవచ్చని యూఎస్ అధికారులు సంకేతాలు ఇచ్చారు.

ఇరాన్ ప్రభుత్వంతో ఆర్థిక సంబంధాలు కొనసాగించే ఎవరైనా అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు.

ఇరాన్ ప్రభుత్వంతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిపినా తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన విలేకరుల సమావేశంలో హెచ్చరించారు.

వివరాలు 

వ్యాపారాలపై ముగిస్తున్న కాలం..

ఇరాన్‌తో వాణిజ్యాన్ని నిలిపివేయడానికి అమెరికా ఇప్పటివరకు నిర్దిష్ట గడువును ప్రకటించలేదు. అయితే వాషింగ్టన్‌ సహనం నశించిపోతోందని బెసెంట్ హెచ్చరించారు.

చైనా వంటి దేశాలు కూడా ఈ ఆంక్షల పరిధిలోకి వస్తాయా అని ప్రశ్నించగా.. నిబంధనల నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్ ప్రభుత్వానికి ఆర్థికంగా ఊపిరాడకుండా చేయడమే తమ లక్ష్యమని, అమెరికా పట్టుదలను పరీక్షించవద్దని హెచ్చరించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం..

అమెరికా తాజా చర్యలతో చైనా, రష్యా, భారత్, పాకిస్తాన్, ఖతార్, టర్కీ వంటి దేశాలపై కూడా ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలను కొనసాగించకుండా ఒత్తిడి పెరుగుతోంది.

ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ఇరాన్‌కు తాజా పరిణామాలు మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.

సోమవారం ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ భారీగా పడిపోయింది. ఒక అమెరికన్ డాలర్‌ విలువ సుమారు 20 లక్షల రియాల్స్‌కు చేరినట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.

మరోవైపు అమెరికా నౌకాదళ దిగ్బంధనం కారణంగా ఇరాన్ తన చమురు ఎగుమతులను దాదాపుగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు చమురు ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరు కావడంతో, వాటికి అంతరాయం ఏర్పడటం దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

ఇరాన్‌ స్పందన ఇదీ..

దేశం ఆర్థిక పతనం అంచునకు చేరుకుందని కొందరు సీనియర్ ఇరాన్ అధికారులు అంగీకరించారు.

దేశంలో నెలకొన్న పరిస్థితిపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కూడా స్పందించారు.

తాము ఇంకా బలంగా ఉన్న సమయంలోనే ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇరాన్‌ను ఆర్థికంగా ఒంటరి చేయడమే లక్ష్యంగా అమెరికా తన వ్యూహాన్ని అమలు చేస్తోంది.

ఇరాన్ ప్రభుత్వానికి నిధులు అందకుండా చేసి, ఆ దేశాన్ని మరింత బలహీనపరచాలని వాషింగ్టన్ భావిస్తోంది.

అయితే ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనేది ఇతర దేశాలు అమెరికా ఆంక్షలను ఏ స్థాయిలో అమలు చేస్తాయనే అంశంపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది.

ADVERTISEMENT