'Merops' Interceptors: ఇరాన్ డ్రోన్లకు అమెరికా 'మెరోప్స్'తో చెక్.. ఖరీదైన క్షిపణులకు బదులుగా చౌక డ్రోన్ల వినియోగం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో యుద్ధం ప్రారంభ దశలో భారీగా సైనిక నష్టాన్ని చవిచూసిన అమెరికా, కొంత ఆలస్యమైనా పరిస్థితిని అదుపులోకి తెచ్చుకుంది. ఇరాన్ వినియోగిస్తున్న షాహెద్ దాడి డ్రోన్లకు ప్రతిస్పందనగా 'మెరోప్స్' అనే అడ్డుకునే డ్రోన్లను రంగంలోకి దించింది. ఈ విషయాన్ని అమెరికా సైనిక కార్యదర్శి డేనియల్ డ్రిస్కాల్ దేశ శాసనసభ ముందు వెల్లడించారు. ఇతర అడ్డుకునే వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో లభించే ఈ 'తేనెపిట్టలు' అమెరికాపై పడుతున్న యుద్ధభారాన్ని గణనీయంగా తగ్గించాయని తెలిపారు. ఇరాన్‌తో యుద్ధం మొదలైన వారం రోజుల్లోనే సుమారు 13 వేల 'మెరోప్స్' డ్రోన్లను తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.
వివరాలు
పశ్చిమాసియాకు నెల క్రితమే 10 వేల మెరోప్స్ డ్రోన్ల తరలింపు
ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయని, ఒక్కటి దాదాపు 15 వేల డాలర్ల వరకు ధర ఉండగా, ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తే ఇంకా తక్కువ ఖర్చుతో లభిస్తాయని చెప్పారు. దీని వల్ల షాహెద్ డ్రోన్లను కూల్చేందుకు ఒక్కదానికి 30 వేల నుంచి 50 వేల డాలర్ల మధ్యే ఖర్చవుతుందని తెలిపారు. ఈ విధంగా యుద్ధ వ్యయాన్ని గణనీయంగా తగ్గించగలిగామని చెప్పారు. ముందుగా ఈ డ్రోన్లను ఉక్రెయిన్‌లో వినియోగించగా మంచి ఫలితాలు వచ్చినట్లు కూడా పేర్కొన్నారు. దాదాపు నెల క్రితమే 10 వేల మెరోప్స్ డ్రోన్లను పశ్చిమాసియాకు తరలించినట్లు తెలిపారు.