LOADING...
Earthquake: వెనెజువెలా,జపాన్‌లో భారీ భూకంపాలు.. సునామీ హెచ్చరికలతో అలర్ట్
వెనెజువెలా,జపాన్‌లో భారీ భూకంపాలు.. సునామీ హెచ్చరికలతో అలర్ట్

Earthquake: వెనెజువెలా,జపాన్‌లో భారీ భూకంపాలు.. సునామీ హెచ్చరికలతో అలర్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
08:09 am

ఈ వార్తాకథనం ఏంటి

వెనెజువెలా, జపాన్‌లో సంభవించిన భారీ భూకంపాలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలుచోట్ల భవనాలు దెబ్బతిన్నట్లు, కొన్ని ప్రాంతాల్లో కూలినట్లు సమాచారం. ప్రాణనష్టం జరిగినట్లు కూడా ప్రాథమిక వివరాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా వెనిజులాలో నిమిషాల వ్యవధిలోనే రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వెనెజువెలాలో రిక్టర్ స్కేలుపై వరుసగా 7.5, 7.1 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు నమోదయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల సమయంలో మోంటాల్‌బాన్ ప్రాంతానికి సమీపంలో భూమికి 13.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వివరాలు 

కరేబియన్ తీర ప్రాంతాలకు అప్రమత్తత సూచనలు జారీ

ఈ ప్రకంపనల ప్రభావం కొలంబియా, కారకాస్ ప్రాంతాల్లో కూడా కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో కరేబియన్ తీర ప్రాంతాలకు అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం అప్రమత్తత సూచనలు జారీ చేసింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. భూకంప ప్రభావంతో కొన్ని అపార్ట్‌మెంట్ల గోడలకు పగుళ్లు ఏర్పడగా, పలుచోట్ల అద్దాలు పగిలిపోయాయి. ప్రకంపనల తీవ్రతతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెనెజువెలాలో సంభవించిన ఈ భూకంపాల కారణంగా ప్యూర్టో రికోతో పాటు అమెరికా వర్జిన్ దీవులకు సునామీ ముప్పు పొంచి ఉందని సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. అయితే అమెరికా ప్రధాన భూభాగ తీర ప్రాంతాలకు ప్రస్తుతం ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని స్పష్టం చేసింది.

వివరాలు 

జపాన్‌లో కూడా రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూకంపం

అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించిన అనంతరం సముద్ర మట్టంలో మార్పులు, బలమైన సముద్ర ప్రవాహాల కారణంగా ప్యూర్టో రికో, వర్జిన్ దీవుల తీర ప్రాంతాల్లో ప్రమాద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా బీచ్‌లు, నౌకాశ్రయాలు, తీర ప్రాంత జలాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా, జపాన్‌లో కూడా రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అక్కడ జరిగిన నష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వెనెజువెలా,జపాన్‌లో భారీ భూకంపాలు

Advertisement