Venezuela Crude Oil: వెనిజులా దగ్గర భారీ చమురు నిల్వలు.. శుద్ధి చేసే సత్తా భారత్ సొంతం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ ఇంధన అవసరాలకు సంబంధించి మరో కీలక పరిణామం తెరపైకి వచ్చింది. వెనిజులా నుంచి ముడి చమురు దిగుమతులను పెంచుకోవడం ద్వారా భారత్ తన ఇంధన సరఫరా మార్గాలను మరింత విస్తరించుకోవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అభిప్రాయపడ్డారు. అయితే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురుకు వెనిజులా ప్రత్యామ్నాయంగా మారుతుందా? అన్నది పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వెనిజులా చమురు ఉత్పత్తి సామర్థ్యం, రవాణా ఖర్చులు, శుద్ధి వ్యయం, అమెరికా ఆంక్షలకు సంబంధించిన విధానాలు ఇందులో కీలకం కానున్నాయి. భారత్ పర్యటనలో భాగంగా మార్కో రూబియో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్ రిఫైనరీని సందర్శించడం ఈ అంశానికి ప్రాధాన్యం తీసుకొచ్చింది.
వివరాలు
ఇతర ప్రయోజనం ఉండొచ్చు
ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాల్లో వెనిజులా ఒకటి కాగా.. భారీ స్థాయిలో, వివిధ రకాల ముడి చమురును శుద్ధి చేయగల సామర్థ్యం భారత్‌కు ఉంది.
ఈ రెండు దేశాల అవసరాలను అనుసంధానించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చని అమెరికా భావిస్తోంది.
వెనిజులాలో చమురు ఉత్పత్తి పెరిగే కొద్దీ, అక్కడి నుంచి మరింత ముడి చమురును దిగుమతి చేసుకుని శుద్ధి చేసే అవకాశాన్ని భారత్ పరిశీలించాలని వాషింగ్టన్ కోరుతోంది.
దీనివల్ల భారతీయ రిఫైనరీలకు మరో సరఫరా మార్గం అందుబాటులోకి రావడంతోపాటు, ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థలో వైవిధ్యం పెరిగే అవకాశం ఉంది.
అదే సమయంలో రష్యా ముడి చమురుపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించాలన్న అమెరికా ప్రయత్నాలకు కూడా ఇది ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు.
వివరాలు
ఇంధన భద్రతలో రిఫైనరీల పాత్ర కీలకం: రూబియో
అయితే ఈ ప్రతిపాదన ఆచరణలోకి వస్తుందా? లేక చర్చలకే పరిమితమవుతుందా? అనేది అదనపు శుద్ధి ఖర్చులు, వెనిజులా ఉత్పత్తిని పెంచగల సామర్థ్యం, నియంత్రణపరమైన అడ్డంకులపై ఆధారపడి ఉంటుంది.
జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనింగ్ సముదాయాన్ని సందర్శించడానికి గల కారణాన్ని వివరిస్తూ మార్కో రూబియో ఇంధన రంగానికి, జాతీయ భద్రతకు మధ్య ఉన్న సంబంధాన్ని ప్రస్తావించారు.
ముడి చమురును శుద్ధి చేయకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదని ఆయన విలేకరులతో అన్నారు. భారీ స్థాయిలో చమురు శుద్ధి సామర్థ్యం ఉన్న సంస్థ మీ వద్ద ఉంది.
విదేశాంగ మంత్రిగా, ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చే చమురు, దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన అంశాలు ఉన్నప్పుడు, అలాంటి సంస్థతో మాట్లాడాలని నేను భావించానని రూబియో వివరించారు.
వివరాలు
వెనిజులా చమురుకు భారత్ రిఫైనరీలు ఎందుకు అవసరం?
ఇంధనం జాతీయ భద్రతతో ముడిపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ''ఇంధనం కోసం దేశాలు యుద్ధాలు చేస్తాయి. ఇంధనం అందుబాటులో లేకపోతే ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయని వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోనే అత్యధిక నిరూపిత చమురు నిల్వలు ఉన్న దేశాల్లో వెనిజులా ఒకటి. ఆ నిల్వల్లో ఎక్కువ భాగం ఒరినోకో బెల్ట్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి.
అక్కడ లభించే ముడి చమురులో అధిక భాగం భారీ రకం (హెవీ క్రూడ్), ఎక్కువ సల్ఫర్ కలిగినది. తేలికపాటి ముడి చమురుతో పోలిస్తే దీన్ని శుద్ధి చేయడం మరింత క్లిష్టం.
ఇలాంటి చమురును ప్రాసెస్ చేయడానికి ప్రత్యేక పరికరాలు, అధునాతన సాంకేతికత, సంక్లిష్టమైన శుద్ధి ప్రక్రియలు అవసరం.
ప్రపంచవ్యాప్తంగా పరిమిత సంఖ్యలోని రిఫైనరీలు మాత్రమే దీన్ని సమర్థంగా శుద్ధి చేయగలవు
వివరాలుీన
ఈ రంగంలో భారత్ కీలక పాత్ర
. ఈ నేపథ్యంలో, జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీ వంటి అధునాతన సదుపాయాలు భారత్‌కు ప్రయోజనాన్ని అందించగలవు.
అయితే, భారీ రకం చమురును కొనుగోలు చేయడం వల్ల వచ్చే ప్రయోజనం.. అది తేలికపాటి చమురు కంటే ఎంత తక్కువ ధరకు లభిస్తుందనే అంశంపై ఆధారపడి ఉంటుంది.
కొనుగోలులో లభించే ధర తగ్గింపు, అదనపు రవాణా ఖర్చులు, శుద్ధి వ్యయాలను మించితేనే రిఫైనరీలకు లాభం చేకూరుతుంది.
వివరాలు
రష్యా చమురుకు వెనిజులా ప్రత్యామ్నాయం కాగలదా?
ఈ ప్రతిపాదనకు ఆర్థిక అంశాలతోపాటు భౌగోళిక రాజకీయ ప్రాధాన్యమూ ఉంది. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించేలా అమెరికా ప్రయత్నిస్తోంది.
అయితే దేశీయ ఇంధన డిమాండ్, ధరలు, వాణిజ్యపరమైన ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునే భారత్ తన ఇంధన కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకుంటోంది.
ఈ పరిస్థితుల్లో వెనిజులా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడం భారత రిఫైనరీలకు మరో ఎంపికను అందించవచ్చు.
కానీ, రష్యా నుంచి ప్రస్తుతం వస్తున్న భారీ పరిమాణంలోని చమురును వెనిజులా సరఫరా తక్షణమే భర్తీ చేయలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
భారతీయ రిఫైనరీలు కొన్నే ఉన్నాయి
వెనిజులా ముడి చమురులో అధిక భాగం భారీ నుంచి అత్యంత భారీ రకానికి చెందినది. దీన్ని నిరంతరాయంగా శుద్ధి చేయగల భారతీయ రిఫైనరీలు కొన్నే ఉన్నాయి.
అంతేకాకుండా, వెనిజులా నుంచి దిగుమతులు పెరగడం అమెరికా ఆంక్షల విధానంపై, ఆ దేశం ఎంత వేగంగా చమురు ఉత్పత్తిని పునరుద్ధరించగలదనే అంశంపై ఆధారపడి ఉంటుందని సంస్థ హెచ్చరించింది.
ఇదే ఈ ప్రతిపాదనకు ప్రధాన పరిమితిగా మారవచ్చు. వెనిజులా నుంచి మరింత చమురు అందుబాటులోకి వచ్చినప్పటికీ, భారతదేశంలోని ప్రతి రిఫైనరీ దాన్ని సమర్థంగా శుద్ధి చేయలేదు.
మరిన్ని శుద్ధి కేంద్రాలు అవసరమైన సాంకేతిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే వరకు, ఈ తరహా చమురును వినియోగించుకునే దేశ సామర్థ్యానికి పరిమితులు ఉంటాయి.
వివరాలు
వెనిజులా ఒక్కటే భర్తీ చేయలేదు
ప్రపంచ చమురు సరఫరాలో ఏర్పడే అన్ని అంతరాయాలను వెనిజులా ఒక్కటే భర్తీ చేయలేదని రూబియో కూడా అంగీకరించారు.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల చమురు సరఫరాలో ఏర్పడే లోటును వెనిజులా ఒక్కటే పూర్తిగా భర్తీ చేయగలదని నేను చెప్పడం లేదు.
అయితే దీర్ఘకాలంలో అది కచ్చితంగా సహాయపడగలదు. స్వల్పకాలంలోనూ కొంత ఉపశమనం కలిగించగలదని ఆయన పేర్కొన్నారు.
భారత్‌తో ఈ అంశంపై గతంలోనూ చర్చలు జరిగాయని, మరింత సహకారాన్ని పరిశీలించేందుకు ఇరు పక్షాలూ సిద్ధంగా ఉన్నాయని రూబియో తెలిపారు.
మేము గతంలోనూ దీనిపై చర్చించాం. వారు దీనికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు'' అని ఆయన అన్నారు.
వివరాలు
వెనిజులా చమురు ఉత్పత్తి పెరుగుతుందా?
వెనిజులాలో భారీ చమురు నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని నిరంతరాయంగా ఉత్పత్తి చేసి ఎగుమతులను పెంచడం వేరే అంశం.
నిల్వలు అధికంగా ఉన్నంత మాత్రాన మార్కెట్‌కు అవసరమైన పరిమాణంలో చమురు అందుబాటులోకి వస్తుందని చెప్పలేం.
ఏళ్ల తరబడి పెట్టుబడులు తగ్గిపోవడం, మౌలిక సదుపాయాల్లో సమస్యలు, దేశ చమురు పరిశ్రమపై విధించిన ఆంక్షలు వంటి అంశాలు వెనిజులా ఉత్పత్తి పెంపు ప్రయత్నాలకు అడ్డంకులుగా మారాయి.
ఉత్పత్తిని దీర్ఘకాలం పాటు పెంచాలంటే కొత్త పెట్టుబడులు, విశ్వసనీయమైన నిర్వహణ వ్యవస్థలు, విదేశీ సంస్థల కార్యకలాపాలు, చమురు విక్రయాలను నియంత్రించే నిబంధనలపై స్పష్టత అవసరం.
అందువల్ల, వెనిజులా నుంచి భారత్‌కు లభించే అదనపు చమురు ప్రయోజనాలు తక్షణమే కాకుండా క్రమంగా అందే అవకాశముంది.
వివరాలు
చమరు ఏ ధరకు లభిస్తుందనేది కీలకం
వాణిజ్యపరంగా ఈ ప్రతిపాదన విజయవంతం కావాలంటే వెనిజులా చమురు ఏ ధరకు లభిస్తుందనేది కీలకం.
అలాగే రవాణా ఖర్చులు, శుద్ధి చేసిన తర్వాత లభించే పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తుల విలువ కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
భారీ రకం చమురు అధునాతన రిఫైనరీకి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, దాని కొనుగోలు నుంచి తుది ఉత్పత్తుల విక్రయం వరకు లెక్కలు లాభదాయకంగా ఉండాలి.
వివరాలు
భారత్‌కు ఎలాంటి ప్రయోజనం కలగవచ్చు?
భారత్ తన అవసరాలకు పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో, వివిధ దేశాల నుంచి చమురును కొనుగోలు చేసే అవకాశాలు పెరగడం వల్ల ఒకే సరఫరాదారు లేదా నిర్దిష్ట రవాణా మార్గంపై ఆధారపడే పరిస్థితి కొంత తగ్గవచ్చు.
అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ వనరులు అందుబాటులో ఉండటం దేశ ఇంధన భద్రతకు ఉపయోగపడుతుంది.
వివిధ రకాల ముడి చమురును శుద్ధి చేయగల సామర్థ్యం జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీకి ఉంది.
దేశీయ అవసరాలకు ఇంధనాన్ని అందించడంతోపాటు, ఎగుమతి మార్కెట్ల కోసం కూడా ఉత్పత్తులను తయారు చేయగలగడం భారత్‌కు అదనపు ప్రయోజనం.
వివరాలు
ఇరు దేశాలకు ప్రయోజనం
ఈ ప్రతిపాదన ఇరు దేశాలకూ ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. వెనిజులాకు తన చమురును విక్రయించేందుకు మరో కొనుగోలుదారు లభించవచ్చు.
భారత్‌కు ముడి చమురును సేకరించడంలో మరింత వెసులుబాటు కలుగుతుంది. మరోవైపు, పశ్చిమ అర్ధగోళంలోని దేశాల నుంచి చమురు సరఫరాలను పెంచే దిశగా భారత్‌ను ప్రోత్సహించే అవకాశం అమెరికాకు లభిస్తుంది.
అయితే ఈ ప్రతిపాదన రష్యా చమురుకు నేరుగా ప్రత్యామ్నాయమని చెప్పలేం. అలాగే, వెనిజులా నుంచి దిగుమతులు పెరిగినంత మాత్రాన భారతీయ వినియోగదారులకు ఇంధన ధరలు తగ్గుతాయని కూడా హామీ లేదు.
సరఫరా ఎంత పెరుగుతుంది? ఏ ధరకు చమురు లభిస్తుంది?శుద్ధి చేయడం ఎంత లాభదాయకంగా ఉంటుంది? అమెరికా ఆంక్షలకు సంబంధించిన పరిస్థితులు ఎలా మారతాయి? అనే అంశాలే తుది ఫలితాన్ని నిర్ణయిస్తాయి.