LOADING...
Venezuela: వెనిజువెలాలో వింత దృశ్యం.. నెత్తురు రంగులో మెరిసిన ఆకాశం
వెనిజువెలాలో వింత దృశ్యం.. నెత్తురు రంగులో మెరిసిన ఆకాశం

Venezuela: వెనిజువెలాలో వింత దృశ్యం.. నెత్తురు రంగులో మెరిసిన ఆకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెనిజులా రాజధాని కారకాస్‌లో జూన్ 30 మంగళవారం సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా దట్టమైన ఎరుపు, నారింజ రంగుల్లో కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి, ఆందోళనకు గురయ్యారు. ఈ అరుదైన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా భూమికి చాలా దిగువన విస్తరించినట్లుగా కనిపించిన ఎర్రటి మేఘాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇటీవల జూన్ 24న వెనిజువెలాలో సంభవించిన భారీ జంట భూకంపాల్లో దాదాపు 2,000 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. ఆ విషాదం నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే ఆకాశం ఇలా నెత్తురు రంగులో కనిపించడంతో, ఇది మరేదైనా విపత్తుకు సంకేతమేమోనని స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

వివరాలు 

అసాధారణ దృశ్యానికి పూర్తిగా శాస్త్రీయ కారణాలే..

అయితే ఈఅసాధారణ దృశ్యానికి పూర్తిగా శాస్త్రీయ కారణాలే ఉన్నాయని నిపుణులు స్పష్టం చేశారు. సహారా ఎడారి నుంచి గాలులతో వచ్చిన సూక్ష్మ ధూళి కణాలు వాతావరణంలో వ్యాపించి సహజ ఫిల్టర్‌లా పనిచేయడంతో ఈ రంగు మార్పు చోటుచేసుకున్నట్లు తెలిపారు. దీనికి భౌతిక శాస్త్రంలోని 'రేలీ స్కాటరింగ్'(Rayleigh Scattering)అనే కాంతి పరిక్షేపణ ప్రక్రియ, స్థానికంగా'కాండిలాజో'గా పిలిచే సహజ దృగ్విషయం కూడా కారణమైంది. సాధారణంగా ఆకాశం నీలిరంగులో కనిపించడానికి కారణమయ్యే తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతి కిరణాలు ధూళి కణాల వల్ల అన్ని వైపులా చెల్లాచెదురైపోతాయి. కానీ ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన ఎరుపు, నారింజ రంగుకిరణాలు మాత్రం ధూళి పొరను దాటుకుని భూమిని చేరగలవు. అందుకే ఆ సమయంలో ఆకాశమంతా ఎరుపు,నారింజ రంగులతో మెరిసినట్లు కనిపించింది.

వివరాలు 

శిథిలాల వెనుక ఎర్రటి ఆకాశం

ప్రకృతి సృష్టించిన ఈ అరుదైన దృశ్యం చూడటానికి ఆకట్టుకున్నప్పటికీ, భూకంపాల ప్రభావంతో సర్వస్వం కోల్పోయిన వెనిజువెలా ప్రజల్లో మాత్రం మరింత భయాన్ని రేకెత్తించింది. సహాయక చర్యలు కొనసాగుతున్న ప్రాంతాల్లో శిథిలాల వెనుక ఎర్రటి ఆకాశం కనిపించడం అక్కడి విషాద పరిస్థితిని మరింత స్పష్టంగా ప్రతిబింబించింది. ఇదే సహారా ధూళి మేఘాలు త్వరలో అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతానికి కూడా చేరే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వెనిజువెలాను భయపెట్టిన ఎర్రటి ఆకాశం.. శాస్త్రవేత్తల వివరణ ఇదే

Advertisement