LOADING...
venezuela: భూకంప విపత్తు వేళ అండగా నిలిచిన దేశాలకు.. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలి కృతజ్ఞతలు

venezuela: భూకంప విపత్తు వేళ అండగా నిలిచిన దేశాలకు.. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలి కృతజ్ఞతలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2026
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో వరుసగా సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. స్వల్ప వ్యవధిలో వచ్చిన ఈ భూకంపాల ప్రభావంతో రాజధాని కరాకస్ నుంచి లా గుఐరా (La Guaira) వరకు అనేక నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 188 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు. వందలాది భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో వెనెజువెలాకు మద్దతుగా ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. తమ దేశానికి సంఘీభావం ప్రకటిస్తూ అత్యవసర సహాయాన్ని అందిస్తున్న దేశాధినేతలకు వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ శుక్రవారం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

వివరాలు 

ప్రత్యేక రెస్క్యూ బృందాలను పంపిన వివిధ దేశాలు 

వెనెజువెలా ప్రజలకు మానవతా దృక్పథంతో అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన కెనడా ప్రధాని మార్క్ కార్నీకి డెల్సీ రోడ్రిగ్జ్ 'ఎక్స్' వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ భారీ విపత్తును ఎదుర్కొనేందుకు డొమినికన్ రిపబ్లిక్ నుంచి తొలి రెస్క్యూ బృందాలు ఇప్పటికే వెనెజువెలాకు బయలుదేరినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్, కోస్టారికా అధ్యక్షురాలు లారా ఫెర్నాండెజ్, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తమ దేశానికి అండగా నిలవడంపై కూడా ఆమె కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా వెనెజువెలాలో నివసిస్తున్న స్పెయిన్ పౌరులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు స్పెయిన్ ప్రభుత్వం ప్రత్యేక రెస్క్యూ బృందాలను పంపినట్లు సమాచారం.

వివరాలు 

రంగంలోకి అమెరికా రెస్క్యూ బృందాలు

వెనెజువెలాలో సహాయక చర్యలకు అమెరికా కూడా వేగంగా స్పందించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్ కౌంటీతో పాటు లాస్ ఏంజిల్స్ నుంచి ప్రత్యేక సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను వెనెజువెలాకు పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో తాను మాట్లాడినట్లు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే తమ తొలి ప్రాధాన్యమని మార్కో రూబియో పేర్కొన్నారు. రాబోయే 48 నుంచి 72 గంటలు అత్యంత కీలకమని, వెనెజువెలా విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతినడంతో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ వనరులను వినియోగిస్తున్నామని చెప్పారు.

Advertisement

వివరాలు 

స్థానిక సిబ్బందితో కలిసి నిరంతరం శ్రమిస్తున్న అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు

అలాగే విపత్తు తీవ్రతను అంచనా వేయడంతో పాటు ముఖ్యంగా తీర ప్రాంతాల పరిస్థితిని పరిశీలించేందుకు అవసరమైన శాటిలైట్ చిత్రాలను కూడా అందిస్తూ సహకరిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం వెనెజువెలాలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కూలిపోయిన భవనాల శిథిలాలను తొలగిస్తూ ప్రాణాలను రక్షించేందుకు అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు స్థానిక సిబ్బందితో కలిసి నిరంతరం శ్రమిస్తున్నాయి.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కెనడా ప్రధాని మార్క్ కార్నీకి డెల్సీ రోడ్రిగ్జ్ 'ఎక్స్' వేదికగా ధన్యవాదాలు

Advertisement