LOADING...
United Airlines Flight: ల్యాండింగ్ సమయంలో ట్రక్‌ను ఢీకొట్టిన విమానం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
ల్యాండింగ్ సమయంలో ట్రక్‌ను ఢీకొట్టిన విమానం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

United Airlines Flight: ల్యాండింగ్ సమయంలో ట్రక్‌ను ఢీకొట్టిన విమానం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

వ్రాసిన వారు Moogati Shabari
May 04, 2026
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఒక విమానం ల్యాండింగ్ సమయంలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పిన ఘటన చోటుచేసుకుంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో హైవేపై వెళ్తున్న ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆదివారం ఈ ఘటన జరిగింది. 231 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం న్యూజెర్సీలో ల్యాండింగ్‌కు చివరి దశలో ఉండగా, దాని ల్యాండింగ్ వీల్ హైవేపై ఉన్న ల్యాంప్‌పోస్ట్‌ను, అలాగే ట్రక్‌ను తాకింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది.

వివరాలు

ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు..

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇటలీలోని వెనిస్ నుంచి వచ్చిన బోయింగ్ 767 విమానం సురక్షితంగా న్యువార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. న్యూజెర్సీ స్టేట్ పోలీస్ ప్రాథమిక విచారణలో వెల్లడించిన వివరాల ప్రకారం, రన్‌వే వైపు వస్తున్న సమయంలో విమానం ల్యాండింగ్ టైర్, దిగువ భాగం హైవేపై ఉన్న ఒక స్తంభాన్ని, అలాగే ట్రాక్టర్-ట్రైలర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఆ స్తంభం తరువాత మరో జీప్ వాహనాన్ని కూడా తాకినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

వివరాలు

డ్రైవర్‌కు చిన్నపాటి గాయాలు..

అయితే ట్రక్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం విడుదల చేసినట్లు న్యూయార్క్, న్యూజెర్సీ పోర్ట్ అథారిటీ తెలిపింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 169లో 221 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో విమానాశ్రయ రన్‌వేలకు సమీపంలోని రోడ్డుపై ఈ ఘటన జరిగింది. హెచ్ అండ్ ఎస్ బేకరీకి చెందిన ట్రక్‌కు పెద్దగా నష్టం జరగలేదని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చక్ పటెరకిస్ తెలిపారు. అయితే విమానం వీల్ డ్రైవర్ వైపు ఉన్న కిటికీని బలంగా ఢీకొట్టిందని, డ్రైవర్‌కు చిన్నపాటి గాయాలు అయినట్లు చెప్పారు.

Advertisement

వివరాలు

తీవ్రంగా స్పందించిన ఎయిర్‌లైన్స్..

ఈ ఘటనపై మాట్లాడిన ఆయన, "ఇది పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉన్నా అందరూ అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు. దేవుడి దయ వల్లే అందరూ క్షేమంగా ఉన్నారు" అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తీవ్రంగా స్పందించింది. పూర్తి స్థాయి ఫ్లైట్ సేఫ్టీ దర్యాప్తు చేపడతామని, ఇందులో భాగంగా విమాన సిబ్బందిని తాత్కాలికంగా సేవల నుంచి తప్పించినట్లు తెలిపింది. ఇక విమానం తయారీ సంస్థ బోయింగ్ మాత్రం ఈ ఘటనపై వెంటనే స్పందించలేదు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

Advertisement