Vietnam: వియత్నాంలో ఘోర విషాదం.. భారతీయులతో వెళ్తున్న పర్యాటక బోటు బోల్తా, 15 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
వియత్నాంలోని ఫు క్వోక్ దీవి సమీపంలో శనివారం ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. 32 మంది భారతీయ పర్యాటకులు, నలుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది భారతీయ పర్యాటకులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. అధికారుల వివరాల ప్రకారం, హోన్ మే రట్ న్గోయ్ (Hon May Rut Ngoai) దీవి నుంచి ఆన్ థోయ్ పోర్టుకు బయలుదేరిన కొద్దిసేపటికే బోటు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో సముద్రంలో భారీ అలలు, బలమైన ఈదురుగాలులు వీచడంతో బోటు అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలిపారు. ఈ ఘటనపై హనోయ్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది.
వివరాలు
కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు
ఫు క్వోక్ దీవి సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న బోటు బోల్తా పడటం అత్యంత విషాదకరమని పేర్కొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను స్థానిక అధికారులతో కలిసి సేకరిస్తున్నామని,గల్లంతైన వారి కోసం వియత్నాం అధికారులు విస్తృతంగా గాలింపు,సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని వెల్లడించింది. బాధితులు,వారి కుటుంబ సభ్యులకు సహాయం అందించేందుకు భారత రాయబార కార్యాలయం హో చి మిన్ సిటీ,హనోయ్ నగరాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. హో చి మిన్ సిటీ కంట్రోల్ రూమ్‌కు +84 36 281 7930,+84 91 552 37 14,+84 33 452 0414 నంబర్లలో సంప్రదించవచ్చు. హనోయ్ నియంత్రణ కేంద్రాన్ని+84 91 308 9165 నంబర్ ద్వారా సంప్రదించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.