LOADING...
Syria clash: సిరియాలో మళ్లీ హింసాకాండ.. 1000 మందికి పైగా మృతి
సిరియాలో మళ్లీ హింసాకాండ.. 1000 మందికి పైగా మృతి

Syria clash: సిరియాలో మళ్లీ హింసాకాండ.. 1000 మందికి పైగా మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 09, 2025
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

సిరియా మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ మద్దతుదారుల తిరుగుబాటుతో అక్కడ మళ్లీ హింస చెలరేగింది. భద్రతా దళాలు, అసద్‌ వర్గీయుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల్లో వెయ్యికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యంత ఘోరమైన ఘటనగా చెప్పొచ్చు. బ్రిటన్‌కు చెందిన 'సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్' ఈ ఘర్షణకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. అసద్‌ మద్దతుదారులు తొలుత ప్రభుత్వ భద్రతా దళాలపై దాడులు ప్రారంభించగా, భద్రతా బలగాలు ప్రతిదాడికి దిగాయి. ఇప్పటివరకు ఈ హింసలో 1,000 మందికి పైగా మృతి చెందారు. వారిలో 745 మంది సాధారణ పౌరులుండగా, 125 మంది భద్రతా సిబ్బంది, 148 మంది అసద్‌ మద్దతుదారులుగా గుర్తించారు.

Details

విద్యుత్, తాగునీటి సరఫరా నిలిపివేత

లటికాయ నగరం పరిసర ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు విద్యుత్‌, తాగునీటి సరఫరాను కూడా నిలిపివేసినట్లు సమాచారం. ఇటీవల తిరుగుబాటుదారులు మెరుపు దాడులతో సిరియాపై అధికారం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసద్‌ తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయారు. తిరుగుబాటుదారులు డమాస్కస్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీని వ్యతిరేకంగా గురువారం అసద్‌ మద్దతుదారులు జబ్లే నగరంలో భద్రతా సిబ్బందిపై దాడి చేసి పలువురిని మట్టుబెట్టారు. అసద్‌కు చెందిన అలావైట్ తెగ ప్రాబల్యం కలిగిన ప్రాంతాల్లోకి ప్రవేశించిన ప్రభుత్వ దళాలు ప్రతీకార దాడులకు దిగాయి.

Details

బినియాస్ పట్టణంలో ఘర్షణలు

ఈ క్రమంలో తిరుగుబాటుదారుల ఇళ్లకు నిప్పంటించడంతో ఘర్షణలు మరింత ముదిరాయి. బనియాస్ పట్టణంలో జరిగిన ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వీధుల్లో, ఇళ్లలో మృతదేహాలు కనిపిస్తున్నప్పటికీ, భయంతో ఎవ్వరూ వాటిని తొలగించేందుకు సాహసించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దాడుల్లో మరణించిన ఐదుగురు సిరియన్‌ దళాల అంత్యక్రియలు శనివారం నిర్వహించగా, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.