Page Loader
Vladimir Putin: ఉక్రెయిన్‌తో మధ్యవర్తిత్వం..భారత్‌తో సహా ఆ 2 దేశాలు చేయగలవు:పుతిన్‌ 
ఉక్రెయిన్‌తో మధ్యవర్తిత్వం..భారత్‌తో సహా ఆ 2 దేశాలు చేయగలవు:పుతిన్‌

Vladimir Putin: ఉక్రెయిన్‌తో మధ్యవర్తిత్వం..భారత్‌తో సహా ఆ 2 దేశాలు చేయగలవు:పుతిన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2024
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నరష్యా, తాజాగా శాంతి చర్చలకు ఆహ్వానం పలికింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత్‌, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు మాస్కో,కీవ్‌ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించగలవని పేర్కొన్నారు. ఈ విషయం ఒక ఆంగ్ల వార్తా సంస్థ ద్వారా వెల్లడైంది. మొదటి వారంలోనే తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో కుదిరిన ప్రాథమిక ఒప్పందం ఉక్రెయిన్‌లో అమలులోకి తేలేదని పుతిన్ విమర్శించారు. ఆ ఒప్పందం ఆధారంగా భవిష్యత్తులో శాంతి చర్చలు జరగవచ్చు అని ఆయన చెప్పారు.

వివరాలు 

శాంతి ప్రక్రియలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది: పెస్కోవ్

వ్లాదివాస్తోక్‌లో జరుగుతున్న ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా పుతిన్, ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని, తాము ఎప్పుడూ వాటిని తిరస్కరించలేదని స్పష్టం చేశారు. ''ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రతినిధులు ఒప్పందంపై సంతకం చేశారు. అంటే ఉక్రెయిన్ ఆ షరతులపై సంతృప్తిగా ఉన్నట్లే లెక్క. అమెరికా, ఐరోపా ఒత్తిడి కారణంగా అది అమలులోకి రాలేదు. కొన్ని ఐరోపా దేశాలు రష్యాను వ్యూహాత్మకంగా ఓడించాలని ఆశిస్తున్నాయి'' అని పుతిన్ వివరించారు. అలాగే, క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్, శాంతి ప్రక్రియలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆయన, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,పుతిన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలున్నాయని, అందువల్ల ప్రధాన భాగస్వాములతో నేరుగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

వివరాలు 

అమెరికా, ఐరోపా దేశాలు దౌత్య పరిష్కారంలో ఆసక్తి చూపడం లేదు

మోదీ, మాస్కో, కీవ్, వాషింగ్టన్ మధ్య అనుసంధానం ఉన్నందున, దిల్లీ ఈ సౌలభ్యాన్ని వినియోగించుకుని శాంతి స్థాపనకు బాటలు వేయచ్చన్నారు. అదనంగా, క్రెమ్లిన్ ఉక్రెయిన్‌లో తన లక్ష్యాలను సాధించే వరకు సైనిక చర్యను కొనసాగిస్తుందని పెస్కోవ్‌ పేర్కొన్నారు. అమెరికా, ఐరోపా దేశాలు దౌత్య పరిష్కారంలో ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. విదేశీ సైనిక నిపుణులు ఉక్రెయిన్‌లో యుద్ధ శిక్షణ కార్యక్రమాలలో పాల్గొంటున్నారని ఆరోపించారు. అమెరికా ఎన్నికల గురించి పెస్కోవ్ వ్యాఖ్యానిస్తూ, ట్రంప్‌తో పోలిస్తే కమలాహారిస్‌ను అంచనావేయడం తేలిక అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ మంత్రి వర్గంలో జరుగుతున్న మార్పులను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇవి శాంతి చర్చలపై పెద్ద ప్రభావం చూపవని అభిప్రాయపడ్డారు.