Volcano: బద్దలైన అగ్నిపర్వతం.. 209 విమాన సర్వీసులకు భారీ అంతరాయం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియాలోని అనక్ క్రాకటౌ అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున భారీగా విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి దట్టమైన బూడిద దాదాపు 50,000 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడినట్లు వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ (PVMBG) అధికారులు తెలిపారు. భారీగా వెలువడిన బూడిద సమీపంలోని గ్రామాలను కప్పివేసినట్లు వెల్లడించారు. అనక్ క్రాకటౌ అగ్నిపర్వతం శుక్రవారం నుంచే క్రియాశీలంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని అంచనా వేసిన అధికారులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సమీప గ్రామాల ప్రజలను వెంటనే ఖాళీ చేయించారు. అలాగే పర్వతారోహకులు, సందర్శకులు అగ్నిపర్వతం పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా అనుమతులను నిలిపివేశారు. ఈ విస్ఫోటనం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు.
వివరాలు
విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం
అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద ఎగసిపడటంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
భద్రతా కారణాల దృష్ట్యా సుకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండోనేషియా పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ వెల్లడించింది.
విమాన సర్వీసుల రద్దుతో మొత్తం 209 విమాన రాకపోకలపై ప్రభావం పడిందని అధికారులు తెలిపారు.
దీంతో సుమారు 22,800 మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
స్థానిక ప్రజల భద్రతతో పాటు విమాన రాకపోకలపై కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.