Page Loader
USA:'స్వచ్ఛందంగా దేశాన్ని విడిచిపెట్టండి'... విదేశీ విద్యార్థులకు హెచ్చరిక మెయిల్స్
'స్వచ్ఛందంగా దేశాన్ని విడిచిపెట్టండి'... విదేశీ విద్యార్థులకు హెచ్చరిక మెయిల్స్

USA:'స్వచ్ఛందంగా దేశాన్ని విడిచిపెట్టండి'... విదేశీ విద్యార్థులకు హెచ్చరిక మెయిల్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో క్యాంపస్ ఆందోళనల్లో క్రియాశీలంగా పాల్గొన్న విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలని సూచిస్తూ, సంబంధిత విద్యార్థులకు ఈమెయిల్స్ పంపినట్లు సమాచారం. ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వారితో పాటు, ఆ ఘటనల దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన వారికీ హెచ్చరికలు అందినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో కొందరు భారతీయ విద్యార్థులు కూడా ఉండే అవకాశముందని సమాచారం. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల ఆన్‌లైన్‌ యాక్టివిటీలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై కొత్తగా ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

Details

దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు

జాతి వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న వారి సోషల్‌ మీడియా ఖాతాలను అమెరికా విదేశాంగ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. వారి పోస్టులు, భాగస్వామ్యం నిజమని తేలినట్లయితే, తక్షణమే విద్యార్థులను దేశం విడిచిపోవాలని ఆదేశించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా విదేశాంగశాఖ, కాన్సులేట్‌ అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 'బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్‌ వీసా' విభాగం నుంచి సంబంధిత విద్యార్థులకు ఈమెయిల్స్ పంపుతున్నట్లు సమాచారం.

Details

నిర్భంధం ఎదుర్కొనే ప్రమాదం

యునైటెడ్ స్టేట్స్‌ ఇమిగ్రేషన్‌, అమెరికా జాతీయచట్టంలోని సెక్షన్‌ 221(i) ప్రకారం, మీ వీసా రద్దయింది. ఈ విషయాన్ని స్టూడెంట్‌ ఎక్స్చేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌ (SEVP) అధికారులకు తెలియజేశారు. మీ వీసా రద్దు విషయాన్ని సంబంధిత కళాశాల యాజమాన్యానికి వారు తెలియజేయవచ్చని మెయిల్‌లో పేర్కొన్నారు. సరైన అనుమతి లేకుండా దేశంలో ఉంటే, నిర్బంధం ఎదుర్కొనే ప్రమాదముందని, భవిష్యత్‌లో వీసా మంజూరు నిషేధించబడవచ్చని హెచ్చరిక సందేశాల్లో పేర్కొన్నారు. తమ స్వదేశాలకు వెళ్లేందుకు విద్యార్థులు CBP హోమ్‌ యాప్‌ ఉపయోగించుకోవచ్చని సూచించారు.