Walmart: హెచ్-1బి వీసా అభ్యర్థులకు ఉద్యోగ ఆఫర్లను నిలిపివేసిన వాల్మార్ట్
ఈ వార్తాకథనం ఏంటి
హెచ్-1బీ వీసా (H-1B Visa) ఫీజును లక్ష డాలర్లవరకు పెంచిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం అమెరికా కంపెనీలలో పెద్ద రకమైన గందరగోళానికి కారణమైంది. ఈ ఫీజు పెంపు కారణంగా,వీసా అభ్యర్థులను నియమించుకోవడంలో అనేక సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. తాజాగా, అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కూడా అలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వాల్‌మార్ట్ హెచ్-1బీ వీసా అభ్యర్థుల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది అని బ్లూమ్‌బర్గ్ ఒక కథనంలో తెలిపింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం,ప్రస్తుతం వాల్‌మార్ట్‌లో 2,000 కంటే ఎక్కువ హెచ్-1బీ వీసా హోల్డర్లు పని చేస్తున్నారు. వాల్‌మార్ట్ ప్రతినిధి మాట్లాడుతూ,"మనం హెచ్-1బీ వీసా నియామక విధానాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాము.కస్టమర్లకు ఉత్తమ సేవ అందించేందుకు,ప్రతిభావంతులను నియమించడంలో కట్టుబడి ఉన్నాం"అని చెప్పారు.
వివరాలు
ట్రంప్ సర్కారు మార్గదర్శకాలను సవరిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ
ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లవరకు పెంచినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఫీజు వార్షికంగా కట్టాల్సిన రుసుము కాకుండా,దరఖాస్తు సమయానికి మాత్రమే చెల్లించాల్సిన వన్‌టైమ్ ఫీజు అని వైట్‌హౌస్ ఆ తర్వాత స్పష్టత ఇచ్చింది. ఈనిర్ణయాన్ని సవాల్ చేసే ప్రయత్నంలో అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో ట్రంప్ సర్కారు కొన్ని మార్గదర్శకాలను సవరిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం,అమెరికాలోనే వీసా స్టేటస్ మార్చుకునే వ్యక్తులకు లేదా ఇప్పటికే హెచ్-1బీ వీసా ఉన్నవారికి దీని వర్తించదు. ఈ లక్ష డాలర్ల ఫీజు విదేశాల నుంచి నేరుగా హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకే వర్తించనుంది అని స్పష్టంచేసింది.