
Pakistan: 'హిందువులతో పోలిస్తే మేము భిన్నం': పాకిస్తాన్ ఆర్మీ చీఫ్
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ వేదికలపై ఎంతటి విమర్శలు ఎదురైనా, పాకిస్థాన్ తన దుర్మార్గపు ధోరణిని మార్చుకోవడం లేదు.
జమ్ముకశ్మీర్ అంశాన్ని తిప్పి తిప్పి చెప్పుకుంటూ, భారత్‌పై ఆరోపణలు చేయడానికి చేసిన ప్రయత్నాలు ఎంతసార్లు విఫలమైనా, దాని మనసు మారడం లేదు.
తాజాగా, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ మళ్లీ కశ్మీర్ విషయాన్ని లేవనెత్తారు. కశ్మీర్ తమ జీవనాడి అంటూ, దాన్ని మరవలేమని స్పష్టం చేశారు.
ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఓవర్సీస్ పాకిస్థానీస్ కన్వెన్షన్‌లో మునీర్ మాట్లాడారు.
వివరాలు
విదేశాల్లో నివసిస్తున్న పాకిస్థానీయులంతా దేశ రాయబారులే
"విదేశాల్లో నివసిస్తున్న పాకిస్థానీయులంతా దేశ రాయబారులే. మీరు ఉన్నతమైన సంస్కృతి, ఆత్మవిశ్వాసాన్ని కలిగినవారిగా వ్యవహరించాలి. మీ పిల్లలకు పాకిస్థాన్ చరిత్రను వివరంగా చెప్పాలి. మన పూర్వీకులు హిందువులతో తాము భిన్నమని భావించి, సొంత సంస్కృతి, సంప్రదాయాలను ఆధారంగా చేసుకుని ఈ దేశాన్ని ఏర్పాటు చేశారు. అదే రెండు దేశాల ఏర్పాటుకు మూలకారణమైంది. మన పూర్వీకులు చేసిన త్యాగాలను, వారి ఆశయాలను మీ తరువాతి తరాలకు చెప్పండి. అప్పుడే వారు పాకిస్థాన్‌తో ఉన్న అనుబంధాన్ని గాఢంగా అనుభవిస్తారు," అని అన్నారు.
వివరాలు
భారతదేశంపై పరోక్షంగా విమర్శలు
తదుపరి, ఉగ్రవాదంపై మాట్లాడిన మునీర్, "ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా పాకిస్థాన్‌లో పెట్టుబడులు రావడం ఆగిపోతుందని కొందరు భయపడుతున్నారు.
ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును నాశనం చేయగలరని మీరు అనుకుంటున్నారా?" అంటూ భారతదేశంపై పరోక్షంగా విమర్శలు చేశారు.
బలోచిస్థాన్ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, అది పాకిస్థాన్‌కి గర్వకారణమని అన్నారు.
అదే విధంగా కశ్మీర్ అంశంలోనూ, "ఈ విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం. కశ్మీర్‌లోని మన సోదరులను మేము ఏ మాత్రం వదిలిపెట్టం," అని ధీమా వ్యక్తం చేశారు.