LOADING...
Taiwan: మేము చైనా ఆధీనంలో లేం.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఘాటు వ్యాఖ్యలు
మేము చైనా ఆధీనంలో లేం.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఘాటు వ్యాఖ్యలు

Taiwan: మేము చైనా ఆధీనంలో లేం.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఘాటు వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2026
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు తైవాన్‌లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ఇప్పటికే తైవాన్‌పై అధికారం చెలాయించాలని చూస్తున్న చైనా.. 'వన్ చైనా' విధానం ప్రకారం తైవాన్ కూడా తమ దేశంలో భాగమేనని ఎప్పటి నుంచో చెబుతోంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టే కీలక ప్రకటన చేశారు. "తైవాన్ బీజింగ్‌ ఆధీనంలో లేదని స్పష్టం చేసిన లై చింగ్-టే.. తైవాన్ స్వాతంత్య్రం అంటే తమ దేశం చైనాలో భాగం కాదని, చైనా నియంత్రణలో లేదని అర్థమని పేర్కొన్నారు. తైవాన్ భవిష్యత్తును వేరే దేశాలు కాదు, అక్కడి ప్రజలే నిర్ణయిస్తారని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు

ట్రంప్ వ్యాఖ్యలపై తైవాన్ ఆగ్రహం

ఇదిలా ఉండగా, చైనా పర్యటన అనంతరం మాట్లాడిన ట్రంప్.. తైవాన్ స్వాతంత్య్రం కోసం అమెరికాపై ఆధారపడొద్దని వ్యాఖ్యానించారు. అలాగే చైనా ఒక బలమైన సైనిక శక్తి అని, తైవాన్‌ను రక్షించడానికి అమెరికా చాలా దూరంలో ఉందని అన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తైవాన్‌లో ఆగ్రహానికి కారణమయ్యాయి. చైనా వైఖరిని, ట్రంప్ వ్యాఖ్యలను తైవాన్ అధ్యక్షుడు తీవ్రంగా తప్పుబట్టారు. తమ ప్రజలు స్వాతంత్య్రం విషయంలో ఎలాంటి రాజీ పడబోరని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు

తైవాన్-చైనా వివాదం ఎలా మొదలైంది?

1949లో చైనాలో అంతర్యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన ప్రభుత్వం తైవాన్‌కు వెళ్లిపోయింది. అనంతరం చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి తైవాన్ తమ భూభాగంలో భాగమేనని చైనా వాదిస్తోంది. కొన్నేళ్లుగా తైవాన్ చుట్టుపక్కల సముద్ర జలాల్లో చైనా తరచుగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ ఒత్తిడి పెంచుతోంది. పలుమార్లు తైవాన్‌ను హెచ్చరించే చర్యలకు కూడా దిగింది. ఇదిలా ఉండగా, అమెరికా అనేక సందర్భాల్లో తైవాన్ స్వతంత్రతకు మద్దతు ప్రకటించింది. అయితే ట్రంప్ తాజా వ్యాఖ్యలు తైవాన్ ప్రజల్లో కొత్త ఆందోళనలకు కారణమవుతున్నాయి.

Advertisement