LOADING...
Donald Trump: తైవాన్‌ను మేం కాపాడలేం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
తైవాన్‌ను మేం కాపాడలేం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump: తైవాన్‌ను మేం కాపాడలేం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2026
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మిత్రదేశమైన తైవాన్‌కు భారీ షాక్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేశారు. తైవాన్‌ను తమ భూభాగంగా ప్రకటిస్తూ దానిని ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనా శక్తిసామర్థ్యాలను ప్రశంసించిన ట్రంప్‌, తైవాన్‌పై తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. ముఖ్యంగా చిప్ తయారీ సాంకేతికతను అమెరికా నుంచి తైవాన్‌ చోరీ చేసిందని ఆరోపించారు. అలాగే అపార సైనిక బలం కలిగిన చైనాతో అనవసరంగా వైరం పెంచుకోవద్దని తైపీకి సూచించారు. రెండు రోజుల బీజింగ్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన ట్రంప్‌ శుక్రవారం వాషింగ్టన్‌లో ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్‌ను రక్షించడం అమెరికాకు తీవ్రమైన సమస్యగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు

చైనాకు తైవాన్‌ కేవలం 59 మైళ్ల దూరం

స్వాతంత్య్రం పేరుతో చైనాతో ఘర్షణకు దారితీసే చర్యలు చేయవద్దని హెచ్చరించారు. చైనాకు తైవాన్‌ కేవలం 59 మైళ్ల దూరంలో ఉంది. కానీ అమెరికా అక్కడి నుంచి సుమారు 9,500 మైళ్ల దూరంలో ఉంది. అంతదూరం వెళ్లి డ్రాగన్‌తో యుద్ధం చేయాలని నేను కోరుకోవడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంతకాలం చైనా తైవాన్‌పై దాడి చేస్తుందని భావించడం లేదని కూడా స్పష్టం చేశారు. ఇటీవల తైవాన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటే ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతామని జి జిన్‌పింగ్ హెచ్చరించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలను చైనా స్వాగతించింది.

వివరాలు

బహుమతులు చెత్తబుట్టలో వేశాం

అమెరికా తమ ఆందోళనలను అర్థం చేసుకుందని విశ్వసిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి తెలిపారు. ఇదిలా ఉంటే, బీజింగ్ పర్యటన సందర్భంగా చైనా ప్రభుత్వం అందించిన బహుమతులను తిరుగు ప్రయాణంలో విమానాశ్రయంలోని చెత్తబుట్టలో వేసినట్లు అమెరికా ప్రతినిధులు వెల్లడించారు. ఆ బహుమతుల్లో ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలు అమర్చే అవకాశం ఉందన్న అనుమానంతోనే అలా చేశామని తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా తమ వ్యక్తిగత ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లను కూడా వెంట తీసుకెళ్లలేదని అధికారులు వెల్లడించారు.

Advertisement