Loading...
USA-Iran: ఇరాన్ యుద్ధ ఖర్చులన్నీ చమురు ఆదాయంతో భర్తీ చేశాం.. ట్రంప్ కీలక ప్రకటన
ఇరాన్ యుద్ధ ఖర్చులన్నీ చమురు ఆదాయంతో భర్తీ చేశాం.. ట్రంప్ కీలక ప్రకటన

USA-Iran: ఇరాన్ యుద్ధ ఖర్చులన్నీ చమురు ఆదాయంతో భర్తీ చేశాం.. ట్రంప్ కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2026
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం వల్ల అమెరికాపై పెద్దగా ఆర్థిక భారం పడలేదన్నట్లుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యానించారు. వెనెజువెలా నుంచి భారీ మొత్తంలో ముడిచమురును రవాణా చేశామని, దాని ద్వారా వచ్చిన ఆదాయంతో యుద్ధ ఖర్చులన్నీ భర్తీ అయ్యాయని వెల్లడించారు. యుద్ధాన్ని ముగించేందుకు తొందరపడాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. టెహ్రాన్‌పై మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే వెనెజువెలా నుంచి చమురు రవాణా ద్వారా అమెరికాకు ఎంత ఆదాయం వచ్చిందనే విషయాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. మరోవైపు ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు అమెరికాకు సుమారు 47 బిలియన్ డాలర్ల ఖర్చు అయినట్లు అంచనా వేస్తున్నారు.

వివరాలు

మూడో దేశానికి ఇరాన్ యురేనియం నిల్వలు?

ఇదిలా ఉండగా, అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ ఆసక్తి చూపుతోందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అంతర్గతంగా ఎదుర్కొంటున్న సమస్యలే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు.

సైనికులు, పోలీసులకు జీతాలు చెల్లించలేని పరిస్థితికి టెహ్రాన్ చేరుకుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య చర్చల కోసం ఓ తాత్కాలిక ముసాయిదా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ ప్రతిపాదనల్లో భాగంగా ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను మూడో దేశానికి తరలించడం లేదా వాటి రేడియోధార్మికతను తగ్గించడం వంటి అంశాలను చేర్చినట్లు సమాచారం.

వివరాలు

హామీదారుగా వ్యవహరించనున్న చైనా

అలాగే ఒప్పందం కుదిరిన ఏడు రోజుల్లోగా హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని ముసాయిదాలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

ఇరాన్ తన అణు కార్యక్రమాలు, సముద్ర భద్రతకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటే.. ప్రతిగా టెహ్రాన్‌పై విధించిన ఆంక్షలు, దిగ్బంధాలను అమెరికా సడలించనుందని సమాచారం.

ఈ ఒప్పందం అమలుకు చైనా హామీదారుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై చర్చలు ఖతార్‌లో జరగనున్నట్లు సమాచారం.

ADVERTISEMENT