Page Loader
India-Pak Tensions: 'మేము అండగా ఉంటాం': భారత్‌కు అమెరికా హామీ
'మేము అండగా ఉంటాం': భారత్‌కు అమెరికా హామీ

India-Pak Tensions: 'మేము అండగా ఉంటాం': భారత్‌కు అమెరికా హామీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2025
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా కీలక ప్రకటనతో స్పందించింది.ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే న్యూఢిల్లీ చర్యలకు తాము పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ అధికారికంగా వెల్లడించారు.

వివరాలు 

భారత్‌తో బంధం ఎంత కీలకమో ట్రంప్‌ పరిపాలనా వ్యవస్థకి స్పష్టంగా తెలుసు 

మైక్ జాన్సన్ మాట్లాడుతూ,"ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ బలంగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈదిశగా న్యూఢిల్లీ తీసుకునే ప్రతి చర్యకు మేము భరోసాగా నిలుస్తాం.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్‌కు అవసరమైన శక్తి, వనరుల విషయంలో మద్దతు అందిస్తాం.భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో ఇది కూడా ఒక భాగం.భారత్‌తో బంధం ఎంత కీలకమో ట్రంప్‌ పరిపాలనా వ్యవస్థకి స్పష్టంగా తెలిసింది.ఉగ్రవాదం వల్ల కలిగే ముప్పు ఏ స్థాయిలో ఉంటుందో మేము బాగా అర్థం చేసుకున్నాం" అని తెలిపారు. గతంలోనూ అమెరికా ఇలాంటి సంఘటనల సమయంలో భారత్‌కు మద్దతుగా నిలిచిన దాఖలాలు ఉన్నాయి. ఏప్రిల్ 22న పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.

వివరాలు 

కేంద్రప్రభుత్వం సీరియస్ చర్యలకు సిద్ధమవుతోందన్న సంకేతాలు

ఆ దాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్,ఈ దారుణ చర్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో భారత్‌కు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.పహల్గాం దాడి పట్ల ప్రధానమంత్రి మోదీ ఇప్పటికే తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఊహించని రీతిలో శిక్షించనున్నట్టు హెచ్చరించారు. దాన్నిఅమలు పరచేందుకు కేంద్రప్రభుత్వం సీరియస్ చర్యలకు సిద్ధమవుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అప్రమత్తత అవసరమని కేంద్రం పిలుపునిచ్చింది.గగనతలదాడులకు ముందు హెచ్చరించే సైరన్ వ్యవస్థను అమలు చేయాలని,అలాగే ప్రజల్లో స్వీయ రక్షణపై అవగాహన పెంచాలని కేంద్ర హోంశాఖ అన్నిరాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.ఈ అంశంపై మంగళవారం సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు.