Sniper Tourism: ధనికుల క్రూర వినోదం.. కోట్ల రూపాయలు ఇచ్చి మనుషుల వేట!
ఈ వార్తాకథనం ఏంటి
యుద్ధ భీతిలో జీవించాల్సిన నిరపరాధులపై కనికరమో,మానవత్వమో చూపకుండా కొంతమంది ధనవంతులు దారుణానికి పాల్పడ్డారు. తమ వినోదం కోసం లక్షలాది యూరోలు వెచ్చించి,బోస్నియా యుద్ధ సమయంలో అమాయక ప్రజలను వేటాడి చంపినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. మూడు దశాబ్దాల కిందట జరిగిన ఈ ఘోర ఘటనపై ఇటలీ అధికారులు కొత్త దర్యాప్తును ప్రారంభించారు. 1992 నుండి 1995 వరకు సాగిన బోస్నియా యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ చరిత్రలో అత్యంత హింసాత్మక ఘర్షణగా గుర్తించబడింది. 1992 ప్రారంభంలో బోస్నియా-హర్జెగోవినాను స్వతంత్ర గణతంత్రంగా ప్రపంచ సమాజం గుర్తించినప్పటి నుండి, అక్కడి 'బోస్నియా సెర్బ్స్' ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించి సరాజెవో (Sarajevo) నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
వివరాలు
యుద్ధంలో 11,000 మందికిపైగా మృతి
దాదాపు మూడు సంవత్సరాలపాటు సాగిన ఆ యుద్ధంలో 11,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వెలుగుచూసిన అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఆ సమయంలో కొందరు ఇటలీకి చెందిన ధనవంతులు "స్నైపర్ టూరిజం" పేరుతో క్రూర వినోదానికి పాల్పడ్డారు. బోస్నియా సెర్బ్స్ దళాలు వీరిని సరాజెవో పరిసర కొండప్రాంతాలకు తీసుకువెళ్లి, అక్కడినుంచి స్నైపర్ తుపాకులతో నిరపరాధులను కాల్చేందుకు అవకాశం కల్పించాయని ఆ నివేదికలు పేర్కొన్నాయి. ప్రతి వేటకు వీరు లక్ష యూరోల వరకు (దాదాపు రూ. కోటి) చెల్లించారని, ఎవరు లక్ష్యమో అనుసరించి రేటు నిర్ణయించబడేదని తెలిపారు. పిల్లలను కాల్చేందుకు ఎక్కువ డబ్బు వసూలు చేసేవారని, వృద్ధులను అయితే ఉచితంగా వేటాడేందుకు అనుమతించేవారని కూడా వివరించారు.
వివరాలు
పత్రాలతో కూడిన కొత్త నివేదిక సిద్ధం
బోస్నియా యుద్ధకాలంలో విదేశీయులు ఈ రకమైన స్నైపర్ టూరిజంలో పాల్గొన్నారన్న ఆరోపణలు అప్పుడే వినిపించాయి. ఈ నేపథ్యంలో జర్నలిస్టు ఎజియో గవాజెనీ(Ezio Gavazzeni)ఆ ఘటనలపై పరిశోధన ప్రారంభించి ఒక నివేదిక రూపొందించారు. అయితే,అప్పట్లో పక్కా ఆధారాలు దొరకకపోవడంతో ఆ నివేదికను నిలిపివేశారు.తరువాత 2022లో స్లోవేనియా దర్శకుడు రూపొందించిన"సరాజెవో సఫారీ" డాక్యుమెంటరీ వెలువడిన తరువాత, గవాజెనీ మళ్లీ తన దర్యాప్తును కొనసాగించారు. బోస్నియా సెర్బ్ సైనికాధికారులు సహా పలువురి వాంగ్మూలాలను సేకరించి,పత్రాలతో కూడిన కొత్త నివేదికను సిద్ధం చేశారు. ఆ వివరాలను ఇటలీ అధికారులకు సమర్పించగా,మిలాన్ దర్యాప్తు సంస్థలు అధికారికంగా విచారణ ప్రారంభించాయి. ప్రస్తుతం ఈ విషయాలు ఇటలీలో పెద్ద చర్చకు దారితీసి,ఆ కాలం నాటి మానవతా నేరాలపై మళ్లీ దృష్టి సారించేలా చేశాయి.