LOADING...
Chagos Islands agreement: 'చాగోస్‌'పై ఒప్పందం కుదిరిన 8 నెలల తర్వాత వ్యతిరేకత ఎందుకు.. అసలేంటీ ఒప్పందం.. బ్రిటన్‌ ఎందుకు అప్పగించింది..
అసలేంటీ ఒప్పందం.. బ్రిటన్‌ ఎందుకు అప్పగించింది..

Chagos Islands agreement: 'చాగోస్‌'పై ఒప్పందం కుదిరిన 8 నెలల తర్వాత వ్యతిరేకత ఎందుకు.. అసలేంటీ ఒప్పందం.. బ్రిటన్‌ ఎందుకు అప్పగించింది..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

చాగోస్‌ ద్వీపాలను మారిషస్‌కు అప్పగించే విషయంలో బ్రిటన్‌ కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా తిరిగి తెరపైకి తెచ్చారు. ఈ ఒప్పందం అత్యంత అవివేకపూరితమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. అయితే, ఎనిమిది నెలల క్రితం బ్రిటన్‌ ఇదే ఒప్పందాన్ని ప్రకటించిన సమయంలో ట్రంప్‌ స్వయంగా దీనిని స్వాగతించడం గమనార్హం. ఇప్పుడు అదే నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. చాగోస్‌ ద్వీప సమూహంలోని డీగో గార్షియా దీవిలో బ్రిటన్‌, అమెరికాలు కలిసి నిర్వహిస్తున్న కీలకమైన సైనిక స్థావరం ఉంది. ఒప్పంద సమయంలో ఈ స్థావరానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 100 ఏళ్ల పాటు కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు.

వివరాలు 

ప్రతిపాదనకు అమెరికా కూడా అంగీకారం

అప్పట్లో ఈ ప్రతిపాదనకు అమెరికా కూడా అంగీకారం తెలిపింది. అయితే, ఇప్పుడు గ్రీన్‌లాండ్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్‌ చాగోస్‌ ఒప్పందంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో చైనా, రష్యాల ఎదుట తలవంచాల్సి వస్తోందని, తద్వారా అమెరికా బలహీనపడుతోందని ఆయన వాదిస్తున్నారు.

వివరాలు 

600 దీవుల సమూహం

హిందూ మహా సముద్రంలో ఉన్న చాగోస్‌ ద్వీప సమూహం 600కుపైగా దీవులతో విస్తరించి ఉంది. ఇది మొత్తం ఆరు అటాల్స్‌గా విభజించబడి ఉంది. మాల్దీవులకు సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం, ఆఫ్రికా,ఇండోనేసియాలకు దాదాపు సమాన దూరంలో ఉంటుంది. 1814లో మారిషస్‌తో పాటు చాగోస్‌ను బ్రిటన్‌ తన ఆధీనంలోకి తీసుకుంది. సైనిక స్థావరం ఏర్పాటు కోసం 1960, 70 దశకాల్లో సుమారు 2,000 మంది చాగోసియన్లు, ఇలోయిస్‌లను బ్రిటన్‌ బలవంతంగా అక్కడి నుంచి తరలించింది. వారు ప్రధానంగా వ్యవసాయ కార్మికులే. ప్రస్తుతం ఈ దీవుల్లో స్థానిక జనాభా లేరు. అయితే, సైనిక సిబ్బంది సహా దాదాపు 4,000 మంది అక్కడ నివసిస్తున్నారు.

Advertisement

వివరాలు 

ఒప్పందం ఇలా

అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో చాగోస్‌పై తన ఆధిపత్యాన్ని వదులుకునేందుకు బ్రిటన్‌ 2024 అక్టోబర్‌లో అంగీకారం తెలిపింది. 1968లో స్వాతంత్య్రం పొందిన మారిషస్‌కు ఈ ద్వీపాలను అప్పగించాలని నిర్ణయించింది. కొంతమంది బ్రిటిష్‌ చట్టసభ సభ్యులు, డీగో గార్షియాలో జన్మించిన బ్రిటిష్‌ పౌరులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయినా, 2025 మే నెలలో బ్రిటన్‌-మారిషస్‌ మధ్య ఒప్పందం ఖరారైంది. డీగో గార్షియాలో సైనిక స్థావరాన్ని కొనసాగించేందుకు బ్రిటన్‌ ఏటా 10.1 కోట్ల పౌండ్లు (రూ.1,226.5 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించింది. మొత్తం 99 ఏళ్ల కాలానికి 3.4 బిలియన్‌ పౌండ్లు (రూ.41,644 కోట్లు) చెల్లించనుంది. ఈ ఒప్పందానికి ట్రంప్‌ అప్పట్లో సూత్రప్రాయంగా సమ్మతి తెలిపారు. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, భారత్‌ ఈ ఒప్పందానికి మద్దతుగా నిలిచాయి.

Advertisement

వివరాలు 

వ్యూహాత్మకంగా కీలకం

హిందూ మహా సముద్రంలోని డీగో గార్షియా సైనిక స్థావరం బ్రిటన్‌, అమెరికాలకు అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగి ఉంది. 2024, 2025లో యెమెన్‌లోని హూతీలపై దాడులకు అమెరికా ఈ స్థావరాన్నే వినియోగించింది. గాజాకు మానవతా సహాయాన్ని కూడా ఇక్కడి నుంచే తరలించింది. 2001లో అఫ్గానిస్థాన్‌లోని అల్‌ఖైదా స్థావరాలపై దాడుల్లోనూ ఈ కేంద్రం కీలక పాత్ర పోషించింది. ఇదే సమయంలో మారిషస్‌తో వాణిజ్య సంబంధాలు కలిగిన చైనా ఈ ప్రాంతంలో క్రమంగా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది.

వివరాలు 

కోర్టు అభిప్రాయం

1965లో మారిషస్‌ నుంచి చాగోస్‌ ద్వీపాలను బ్రిటన్‌ వేరు చేసింది. మూడేళ్ల తర్వాత మారిషస్‌కు స్వాతంత్య్రం ఇచ్చింది. 2019లో ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తిపై అంతర్జాతీయ న్యాయస్థానం స్పందిస్తూ... ఈ ప్రాంతంపై బ్రిటన్‌ తన నియంత్రణను వదులుకోవాలని సూచించింది. స్థానికులను బలవంతంగా తరలించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.

వివరాలు 

న్యాయపరమైన సవాళ్లు

ఒప్పందంపై సంతకాలు చేసేందుకు ముందు చివరి నిమిషంలో బ్రిటన్‌ హైకోర్టు జడ్జి ఇంజంక్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. చాగోసియన్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపిస్తూ డీగో గార్షియాలో జన్మించిన బ్రిటిష్‌ పౌరులు బెర్నార్డెట్‌ డుగాసీ, బెట్రీస్‌ పాంప్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, హైకోర్టు ధర్మాసనం ఈ ఉత్తర్వులను రద్దు చేస్తూ ఒప్పందానికి మార్గం సుగమం చేసింది.

వివరాలు 

ఆందోళనలు ఎందుకు?

చైనా ప్రభావం పెరగడం వల్ల ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరానికి ముప్పు ఏర్పడుతుందని 2025 ఫిబ్రవరిలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక ఒప్పందం కుదిరిన అనంతరం మారిషస్‌ ప్రధానిగా ఎన్నికైన నవీన్‌ రామ్‌గులాం ఈ ఒప్పందంపై ప్రశ్నలు లేవనెత్తారు. దీనిని ట్రంప్‌ సమీక్షించి సరైనదేనని స్పష్టం చేయాలని ఆయన కోరారు. అలాగే బ్రిటన్‌లో నివసిస్తున్న చాగోసియన్లు కూడా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. ఒప్పందానికి ముందు తమను సంప్రదించలేదని వారు విమర్శించారు. ఈ ఒప్పందం అమెరికా, నాటో కూటమిని బలహీనపరుస్తుందని బ్రిటన్‌ ప్రతిపక్ష నేత కెమీ బడెనాక్‌ మంగళవారం వ్యాఖ్యానించారు.

Advertisement