Strait of Hormuz route: హోర్ముజ్ జలసంధిలో కొత్త నౌకా మార్గం.. ఇరాన్-ఒమాన్ కీలక చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వాణిజ్య నౌకల రాకపోకల నిర్వహణపై ఇరాన్, ఒమాన్ కీలక చర్చలు జరుపుతున్నాయి. గత కొద్ది నెలలుగా ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు,నౌకాయానానికి ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో భద్రమైన రవాణా కోసం తాత్కాలిక సముద్ర మార్గాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్త నిర్వహణ విధానాన్ని అమలు చేయాలని రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల కారణంగా హోర్ముజ్ జలసంధిలో నౌకాయానం తీవ్రంగా ప్రభావితమైంది. అమెరికాతో చర్చలు పునఃప్రారంభమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ, ఇరాన్ మాత్రం ఆ వార్తలను ఖండించింది.
వివరాలు
చర్చలు తుది దశకు చేరుకున్నాయి: అబ్బాస్ అరఘ్చీ
ప్రస్తుతం తమ చర్చలు ఒమాన్‌తో మాత్రమే జరుగుతున్నాయని, హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు సంబంధించిన భవిష్యత్ వ్యవస్థపైనే దృష్టి పెట్టామని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు.
ఒమాన్‌తో కలిసి వీలైనంత త్వరగా తాత్కాలిక సముద్ర మార్గాన్ని ఖరారు చేసి, హర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతను నిర్ధారించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ కూడా చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ఇరు దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించే విధంగా కొత్త మార్గాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
వివరాలు
ఎందుకు కొత్త మార్గం అవసరమైంది?
హర్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను ఒమాన్ గల్ఫ్, అరేబియా సముద్రంతో అనుసంధానించే అత్యంత కీలక సముద్ర మార్గం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు (LNG)లో గణనీయమైన భాగం ఇదే మార్గం గుండా అంతర్జాతీయ మార్కెట్లకు చేరుతుంది.
ఇటీవలి సైనిక ఉద్రిక్తతల కారణంగా ఈ మార్గంలో భద్రతా సమస్యలు పెరిగాయి.
దీంతో నౌకల బీమా ప్రీమియాలు, రవాణా వ్యయాలు పెరగడంతో పాటు ప్రపంచ ఇంధన సరఫరాపై కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
వివరాలు
ప్రస్తుతం అమలులో ఉన్న విధానం
ప్రస్తుతం హర్ముజ్ జలసంధిలో ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్ (Traffic Separation Scheme-TSS) ప్రకారం నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయి.
ఇందులో రెండు ప్రధాన నౌకా మార్గాలు ఉంటాయి. ఒక్కో మార్గం సుమారు రెండు నాటికల్ మైళ్ల వెడల్పుతో ఉండగా, వాటి మధ్య మరో రెండు నాటికల్ మైళ్ల బఫర్ జోన్ ఉంటుంది.
పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశించే నౌకలు ఒక మార్గాన్ని, బయటకు వచ్చే నౌకలు మరో మార్గాన్ని వినియోగిస్తాయి.
హోర్ముజ్ ఉత్తర భాగం ఇరాన్ పరిధిలో, దక్షిణ భాగం ఒమాన్ పరిధిలో ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నావిగేషన్ విధానమే అమల్లో ఉంది.
ఇరాన్, ఒమాన్ సంయుక్తంగా ఈ మార్గాన్ని నిర్వహించే వ్యవస్థ ఇప్పటివరకు లేదు.
వివరాలు
ఒమాన్ ప్రతిపాదన ఏమిటి?
ఒమాన్ ప్రతిపాదన ప్రకారం మలక్కా జలసంధి నమూనాలో హోర్ముజ్‌ను నిర్వహించాలని భావిస్తోంది.
ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ దేశాలు మలక్కా జలసంధిలో నౌకాయాన భద్రత, సముద్ర రక్షణ, సమన్వయాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లే, హోర్ముజ్‌లో కూడా ఇరాన్, ఒమాన్ కలిసి వ్యవహరించాలని సూచించింది.
ఈ ప్రతిపాదనలో నౌకా మార్గాన్ని ఇరాన్, ఒమాన్ ప్రాదేశిక జలాల్లో సమానంగా విభజించి, గల్ఫ్‌లోకి వచ్చే నౌకలు ఒక వైపు, బయటకు వెళ్లేవి మరో వైపు ప్రయాణించేలా చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం.
వివరాలు
ఇరాన్ ప్రత్యామ్నాయ ప్రతిపాదన
అయితే ఒమాన్ సూచించిన 50-50 విభజనను ఇరాన్ అంగీకరించలేదు.
ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది తెలిపిన వివరాల ప్రకారం, తమ దేశ పరిధిలోని మార్గాన్ని పూర్తిగా ఇరాన్ పర్యవేక్షించడంతో పాటు, ఎదురువైపు మార్గంలోని కొంత భాగంపైనా పర్యవేక్షణ అధికారాలు ఉండేలా ప్రతిపాదించింది.
ఈ విధానం అమల్లోకి వస్తే హోర్ముజ్ గుండా వచ్చే, వెళ్లే నౌకలపై ఇరాన్‌కు మరింత పర్యవేక్షణ అధికారం లభిస్తుంది.
భవిష్యత్తులో అమలయ్యే ఏ వ్యవస్థ అయినా తమ దేశ సార్వభౌమాధికారం, భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడాలని ఇరాన్ స్పష్టం చేసింది.
వివరాలు
ఇరాన్ ప్రత్యామ్నాయ ప్రతిపాదన
అలాగే పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశించే, బయటకు వెళ్లే వాణిజ్య నౌకలకు ముందస్తు సమాచారం లేదా అనుమతి విధానాన్ని ప్రవేశపెట్టాలని కూడా ప్రతిపాదించింది.
అయితే నౌకలపై అదనపు రవాణా సుంకాలు విధించే ఉద్దేశం లేదని ఇరాన్ పేర్కొంది.
పైలటేజ్, నావిగేషన్ సహాయం, సముద్ర భద్రత వంటి సేవలకు సంబంధించిన రుసుములు మాత్రమే ఉండేలా ఒమాన్‌తో కలిసి వ్యవస్థను రూపొందించాలని భావిస్తోంది.
వివరాలు
అంతర్జాతీయ ఆందోళనలు
అమెరికా సహా పలు దేశాలు అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకం కలగకూడదని స్పష్టం చేస్తున్నాయి.
ఒకే దేశం ఏకపక్షంగా నిబంధనలు విధించే పరిస్థితి రాకూడదని అభిప్రాయపడుతున్నాయి.
ఇదిలా ఉండగా, అమెరికా నౌకాదళ ఆధ్వర్యంలోని జాయింట్ మారిటైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (JMIC) ఇటీవల వాణిజ్య నౌకల భద్రత కోసం ఒమాన్ జలాలకు సమీపంగా కొత్త ట్రాన్సిట్ మార్గాన్ని ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు సాధారణ స్థాయికి చేరుకోలేదు.
వివరాలు
అంతర్జాతీయ ఆందోళనలు
ఒమాన్ తీరానికి సమీపంలో ఇటీవల ఓ కార్గో నౌక గుర్తుతెలియని ప్రక్షేపకానికి గురైనట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) వెల్లడించింది.
అలాగే కేప్లర్ (Kpler) గణాంకాల ప్రకారం సోమవారం హోర్ముజ్ గుండా కేవలం ఆరు నౌకలు మాత్రమే ప్రయాణించగా, అంతకుముందు రోజు ఆ సంఖ్య ఏడు ఉంది.
దీంతో ఈ కీలక సముద్ర మార్గంలో ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తగ్గలేదని స్పష్టమవుతోంది.