ఆ మంచు కరిగిందా అంతే సంగతులు; ప్రమాదంలో మానవాళి
భూమిపై ఉన్న మానవాళి, జంతుజాలం ఎదుర్కొనే ప్రమాదకర పరిస్థితులను వివరించే పరిశోధనాత్మక కథనాన్ని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ ప్రచురించింది. ఆర్కిటిక్ మంచుతో కప్పబడిన భూమి క్రమంగా వేడెక్కుతున్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర రసాయనాలు విడుదలయ్యే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితులు ఈ శతాబ్దం చివరి నాటికి మానవాళి అనభవిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మంచుకరగడం, గనులు, పైప్‌లైన్ ఉన్న వేల పారిశ్రామిక ప్రదేశాల్లోని నిర్మాణాలు ప్రమాదంలోకి నెట్టివేయబడుతాయని జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన నివేదించింది. అయితే ఇప్పటికే 5వేల ప్రదేశాలు ప్రమాదంలోనే ఉన్నట్లు పేర్కొన్నారు.
తెలియని ప్రదేశాల్లో కూడా కాలుష్య కారకాలు విడుదలయ్యే అవకాశం
ఆర్కిటిక్ మంచు కరగడం వల్ల పారిశ్రామిక కాలుష్య రసాయనాలు ఎక్కడ విడుదలవుతాయనే దానిపై గణాంకాల ఆధారంగా చెప్పవచ్చని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ నివేదించింది. అయితే తెలియని ప్రదేశాల్లో కూడా కాలుష్య కారకాలు విడుదలయ్యే అవకాశం ఉందని న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. మంచు కరగడం వల్ల విడుదలయ్యే రసాయనాల వల్ల ఆర్కిటిక్ ప్రదేశాల్లో నివసించే చేపలతో పాటు ఇతర జంతుజాలం ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని జర్మనీకి చెందిన పోట్స్‌డామ్‌లోని ఆల్ఫ్రెడ్ వెజెనర్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకుడు మోరిట్జ్ లాంగర్ ఆందోళన వ్యక్తం చేశారు. మంచును శాశ్వతంగా కరిగించడం వల్ల పర్యావరణంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.