White House Locked Down: వైట్‌హౌస్ వద్ద భద్రతా కలకలం.. రెండు ఘటనలతో అరగంట లాక్‌డౌన్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో వరుసగా రెండు భద్రతాపరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు దాదాపు అరగంట పాటు వైట్‌హౌస్‌ను లాక్‌డౌన్‌లో ఉంచారు. ఈ ఘటనలు వైట్‌హౌస్‌కు సమీపంలోని లాఫాయెట్ పార్క్ వద్ద జరిగాయి.
వివరాలు
వేగంగా దూసుకొచ్చిన కారు.. వ్యక్తి అరెస్ట్
ఒక వ్యక్తి వెండి రంగు సెడాన్ కారును వేగంగా నడుపుతూ ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లాడు.
అక్కడ ఉన్న సూచిక బోర్డును ఢీకొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సమాచారం అందుకున్న సీక్రెట్ సర్వీస్ అధికారులు, నేషనల్ గార్డ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
కారును నడిపిన వ్యక్తిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అతడు భద్రతా సిబ్బందితో దూకుడుగా ప్రవర్తించాడు.
అయినప్పటికీ అధికారులు వేగంగా స్పందించి అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
వివరాలు
వైట్‌హౌస్‌లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేత
మరో వ్యక్తి కూడా భద్రతా వలయాన్ని దాటే ప్రయత్నం చేశాడు. దాదాపు ఇదే సమయంలో లాఫాయెట్ పార్క్ వాయవ్య మూలలో ఉన్న భద్రతా బారికేడ్లను దూకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు.
అప్రమత్తమైన సిబ్బంది అతడిని కూడా వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఈ ఘటనలకు పాల్పడటం వెనుక వారి ఉద్దేశం ఏమిటి? అనే వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
ఈ పరిణామాలతో వైట్‌హౌస్‌లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం అరగంట తర్వాత తిరిగి ప్రారంభించారు.
వివరాలు
భారీ ఆయుధాలతో మరో వ్యక్తి అరెస్ట్
ఇదిలా ఉండగా.. గత గురువారం వైట్‌హౌస్ సమీపంలో భారీ ఆయుధాలతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వెనిజులాకు చెందిన రోనీ యోడ్రిక్స్ గువానిపా క్రినోస్ (30)ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
రొటీన్ పెట్రోలింగ్‌లో భాగంగా కాన్‌స్టిట్యూషన్ అవెన్యూలో అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉన్న నీలిరంగు ఫోర్డ్ పికప్ ట్రక్కును ఓ అధికారి గుర్తించారు.
వాహనంలో ఉన్న వ్యక్తిని తనిఖీ చేసే క్రమంలో అతడి వద్ద ఆయుధాలు ఉన్నాయా? అని అధికారి ప్రశ్నించారు.
అందుకు అతడు అవునన్నట్లుగా తల ఊపడంతో పాటు వేలితో తుపాకీలా సైగ చేశాడు.
ఆ తర్వాత గూగుల్ ట్రాన్స్‌లేట్ సహాయంతో అధికారులతో మాట్లాడాడు.
వివరాలు
ట్రక్కులో ఏఆర్-15 రైఫిల్, రెండు చేతి తుపాకులు, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి
తనను చంపేందుకు ప్రయత్నించిన వ్యక్తి నుంచి తుపాకీని లాక్కున్నానని చెప్పాడు. దీంతో అధికారులు వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ట్రక్కులో ఏఆర్-15 రైఫిల్, రెండు చేతి తుపాకులు, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి ఉన్నట్లు గుర్తించారు.
తదుపరి విచారణలో అతడు వెల్లడించిన విషయాలు అధికారులను దిగ్భ్రాంతికి గురిచేశాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపాలని తన తలలోని స్వరాలు ఆదేశించాయని అతడు చెప్పినట్లు అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటనల నేపథ్యంలో వైట్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.