WHO: ఎబోలా విజృంభణపై WHO ఆందోళన.. వందల కేసులు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్రికా దేశమైన కాంగోలో అరుదైన బుండిబుగ్యో రకం ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తూర్పు కాంగోలో ఇప్పటివరకు 134 అనుమానాస్పద మరణాలు, 500కు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొదటి మరణం జరిగిన తర్వాత కూడా వైరస్‌ను గుర్తించడంలో ఆలస్యం కావడంతో పరిస్థితి మరింత విషమించింది. సాధారణంగా కనిపించే జైర్ రకం ఈబోలాగా భావించి పరీక్షలు చేయగా నెగటివ్ రావడంతో అసలు వైరస్ గుర్తించడానికి కొన్ని వారాలు పట్టింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న బుండిబుగ్యో రకానికి ఆమోదం పొందిన వ్యాక్సిన్ లేదా మందులు లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
అమెరికా, బ్రిటన్ నుంచి ఎబోలా వ్యాక్సిన్లు
మొదటి కేసు నమోదైన బునియా ప్రాంతంలో ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక రక్షణ దుస్తులు ధరించి సేవలు అందిస్తున్నారు. స్థానిక ప్రజల్లో భయం పెరుగుతోంది. "ఎబోలా ఎంత ప్రమాదకరమో నాకు తెలుసు" అంటూ స్థానిక మహిళ నోయెలా లుమో ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా అమెరికా, బ్రిటన్ నుంచి ఎబోలా వ్యాక్సిన్లు త్వరలో కాంగోకు చేరనున్నట్లు వైరస్ నిపుణుడు జీన్-జాక్ ముయెంబే తెలిపారు. అయితే వాటి ఫలితాలు రావడానికి సమయం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి వేగం,పట్టణ ప్రాంతాల్లో కేసులు పెరగడం,ఆరోగ్య సిబ్బంది మరణాలు, ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు.
వివరాలు
అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి
పొరుగు దేశమైన ఉగాండా రాజధాని కంపాలాలో కూడా కాంగో నుంచి వెళ్లిన వ్యక్తుల్లో ఈబోలా కేసులు నమోదైనట్లు WHO వెల్లడించింది. ఈ పరిస్థితిని అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా WHO ప్రకటించింది. వైరస్ నియంత్రణకు ఉగాండా సరిహద్దు ప్రాంతాల్లో సహాయక బృందాలు, వైద్య సామగ్రిని తరలిస్తున్నారు. అయితే తూర్పు కాంగోలోని కొన్ని ప్రాంతాలు తిరుగుబాటు దళాల ఆధీనంలో ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. బునియాలోని UNICEF కార్యాలయం ఇప్పటికే 16 టన్నుల అత్యవసర సామగ్రిని పంపించింది. ఇందులో శానిటైజర్లు,సబ్బులు,రక్షణ దుస్తులు,నీటి శుద్ధి మాత్రలు ఉన్నాయి. మరోవైపు అమెరికాకు చెందిన వైద్యుడు డాక్టర్ పీటర్ స్టాఫర్డ్ కూడా ఎబోలాకు గురైనట్లు సమాచారం. ఆయన రోగులకు చికిత్స అందిస్తూ వైరస్ బారిన పడ్డారని తెలుస్తోంది.
వివరాలు
రక్తం, వాంతులు, శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్
ఎబోలా వైరస్ రక్తం, వాంతులు, శరీర ద్రవాల ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. జ్వరం,తలనొప్పి,కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గతంలో జరిగిన భారీ ఎబోలా వ్యాప్తిలో 11 వేల మందికి పైగా మరణించారు. ముఖ్యంగా అంత్యక్రియల సమయంలో వైరస్ ఎక్కువగా వ్యాపించిందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బునియా ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, శుభ్రత పాటించాలని, అంత్యక్రియల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. "ఇప్పటికే భద్రతా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు ఎబోలా కూడా రావడంతో పరిస్థితి మరింత కష్టంగా మారింది" అని స్థానికుడు జస్టిన్ ఎండాసి ఆవేదన వ్యక్తం చేశాడు.