అగ్రదేశాల్లో మరోసారి కరోనా కలకలం.. వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
అంతర్జాతీయంగా కొవిడ్ వ్యాప్తి మళ్లీ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఎరిస్ కరోనా వేరియంట్ మరోసారి విజృంభిస్తోంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అగ్రదేశాలు అమెరికా, చైనా దేశాల్లో ఎరిస్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు దక్షిణకొరియా, జపాన్, కెనడా దేశాల్లోనూ ఎరిస్ కరోనా వేరియంట్ లక్షణాలను గుర్తించామని వెల్లడించింది. ఒమైక్రాన్ వైరస్ జాతికి చెందిన ఎరిస్ వేరియంట్ కారణంగా ఎదురయ్యే ప్రమాదాలపై అధ్యయనం జరగాలని ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ఓమైక్రాన్ వేరియంట్‌ల కంటే ఎరిస్ వైరస్ అంత తీవ్రంగా లేకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్‌ఖోవ్ అభిప్రాయపడ్డారు.
చాలా దేశాలు మాకు కొవిడ్ డేటా నివేదించట్లేదు : డబ్ల్యూహెచ్ఓ
ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 6.9 మిలియన్లకుపైగా ప్రజలు కొవిడ్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. సదరు వైరస్ పుట్టినప్పట్నుంచి సుమారు 768 మిలియన్లకుపైగా కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 మార్చిలో కొవిడ్ 19ను మహమ్మారిగా ప్రకటించింది. మూడేళ్ల తర్వాత 2023 మేలో కొవిడ్-19పై ఎమర్జెన్సీ పరిస్థితిని ఎత్తివేసింది. ఈ క్రమంలోనే అధిక దేశాలు తమకు కొవిడ్ డేటాను అందించట్లేదని డబ్ల్యూహెచ్ఓ డీజీ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. ఈజీ.5, ఎరిస్ వేరియంట్ వైరస్‌కు సంబంధించి 11 శాతం మంది మాత్రమే చికిత్సల కోసం ఆస్పత్రుల్లో చేరారన్నారు.