అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ కలకలం.. కొవిడ్ కేసుల్లో ఈజీ5ది 17 శాతం
అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ మళ్లీ కలకలం రేపుతోంది. మొత్తం కేసుల్లో ఈజీ 5 వేరియంట్ 17 శాతం కారణమని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ (USCDC) ప్రకటించింది. ఒమిక్రాన్ వైరస్ జాతికి చెందిన ఎక్స్‌బీబీ 1.9.2 రికాంబినెంట్ వైరస్ నుంచి ఇది ఉద్భవించిందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఎక్స్‌బీబీ 1.9.2 తో పోల్చితే ఈజీ 5లోని స్పైక్ ప్రోటీన్‌లో అదనంగా జన్యుమార్పు ఉన్నట్లు తేల్చారు. శరీరంలోని కణాలకు వైరస్ సోకేందుకు స్పైక్ ప్రోటీన్ కీలకమైన అంశం. ఈ కొత్త జన్యుమార్పును గతంలోనే వేరే కరోనా వేరియంట్లలోనూ గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని కారణంగా వైరస్‌కు అందే అదనపు ప్రయోజనాలపై స్పష్టత లేదన్నారు.
ఈజీ 5 కంటే ఈజీ 5.1 వేరియంట్ సమర్థంగా తప్పించుకుంటోంది : నిపుణులు
ఈ జన్యుమార్పు 465 మ్యూటేషన్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా 35 శాతం వైరస్‌లల్లో ఈ మ్యూటేషన్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మరోవైపు, ఈజీ 5 నుంచి ఇప్పటికే ఈజీ 5.1 పేరుతో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ నిపుణులు డా.డేవిడ్ హో, ఈ వైరస్‌పై పరిశోధిస్తున్నారు. కొవిడ్ టీకాలతో ప్రేరేపితమైన యాంటీబాడీల నుంచి ఈ వైరస్ తప్పించుకోగలదా లేదా అనే విషయాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రెండు కొత్త వేరియంట్లు టీకా ద్వారా శరీరంలోకి సమకూరే యాంటీబాడీల నుంచి కొంత మేర తప్పించుకోగలుతున్నట్లు నిర్థారించారు. ఇతర వేరియంట్లతో చూస్తే ఈజీ 5.1 రోగనిరోధక వ్యవస్థ నుంచి సమర్థంగా తప్పించుకుంటున్నట్లు తెలిపారు.