LOADING...
Ahmed Al Ahmed: సిడ్నీ ఉగ్రదాడిలో ప్రాణాల్ని పణంగా పెట్టి ఉగ్రవాదిని అడ్డుకున్నఅహ్మద్ అల్ అహ్మద్ ఎవరు? 
సిడ్నీ ఉగ్రదాడిలో ప్రాణాల్ని పణంగా పెట్టి ఉగ్రవాదిని అడ్డుకున్నఅహ్మద్ అల్ అహ్మద్ ఎవరు?

Ahmed Al Ahmed: సిడ్నీ ఉగ్రదాడిలో ప్రాణాల్ని పణంగా పెట్టి ఉగ్రవాదిని అడ్డుకున్నఅహ్మద్ అల్ అహ్మద్ ఎవరు? 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 15, 2025
02:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో యూదులపై జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ హృదయ విదారక ఘటనలో ఉగ్రవాదులను ఎదుర్కొంటూ ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వ్యక్తిగా అహ్మద్‌ అల్‌ అహ్మద్‌ నిలిచారు. 'బోండీ బీచ్ హీరో'గా గుర్తింపు పొందిన ఆయన ధైర్యం అందరి మనసులను తాకుతోంది. దాడి జరుగుతున్న వేళ తాను ప్రాణాలు కోల్పోవచ్చనే భావనతో తన కుటుంబానికి సందేశం చేరవేయాలని ఆయన పక్కన ఉన్నవారిని కోరిన మాటలు భావోద్వేగాన్ని కలిగిస్తున్నాయి.

వివరాలు 

సిరియా నుంచి వచ్చి.. 

అహ్మద్‌ అల్‌ అహ్మద్‌ స్వస్థలం సిరియా. నిరంతర అంతర్యుద్ధంతో అల్లాడుతున్న ఆ దేశాన్ని విడిచి మెరుగైన భవిష్యత్తు ఆశతో సుమారు పదేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వలస వచ్చారు. కుటుంబంతో కలిసి దక్షిణ సిడ్నీలోని సదర్లాండ్‌ షైర్‌లో స్థిరపడి కొత్త జీవితం మొదలుపెట్టారు. ఆయనకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం స్థానికంగా ఓ పండ్ల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. బోండీ బీచ్‌లో దాడి - తండ్రీకొడుకుల ఘాతుకం ఉగ్రదాడి జరిగిన ఆదివారం ఉదయం అహ్మద్‌ తన బంధువు జోజీ అల్కాంజ్‌తో కలిసి బోండీ బీచ్‌లోని ఒక కాఫీ షాప్‌లో ఉన్నారు. అకస్మాత్తుగా కాల్పుల శబ్దాలు వినిపించగానే వీరిద్దరూ భయపడిపోయారు కొద్ది సేపటికే తేరుకున్న అహ్మద్‌ పరిస్థితిని గమనించి ఉగ్రవాదులను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు.

వివరాలు 

ఉగ్రవాదిని అడ్డుకున్న ధైర్యం 

ప్రాణాపాయం తప్పదని తెలిసినా వెనుకడుగు వేయలేదు. "నేను చనిపోవచ్చు. నా కుటుంబాన్ని చూసుకో. నాకేమైనా జరిగితే ఇతరుల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలోనే నేను ప్రాణాలు కోల్పోయానని వాళ్లకు చెప్పు" అంటూ తన బంధువుతో అహ్మద్‌ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ విషయాన్ని అల్కాంజ్‌ మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన సమయంలో కాల్పులు జరుపుతున్న దుండగుల్లో ఒకడిని అహ్మద్‌ ధైర్యంగా ఎదుర్కొన్నారు. వెనక నుంచి వెళ్లి అతని చేతిలోని తుపాకీని లాక్కొనడంతో దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉగ్రవాదిని అడ్డుకునే ప్రయత్నంలో అహ్మద్‌కు గాయాలు కాగా, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

వివరాలు 

ట్రంప్‌ నుంచి ప్రశంసలు 

అహ్మద్‌ చూపిన సాహసాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసించారు. ఉగ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొన్న ఆయన చర్యపై గర్వంగా ఉందని పేర్కొన్నారు. అహ్మద్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

వివరాలు 

చేపల వేట పేరుతో వచ్చి ఉగ్రదాడి 

సిడ్నీలోని బోండీ బీచ్‌లో జరిగిన ఉత్సవ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన వారు తండ్రీకొడుకులని పోలీసులు నిర్ధారించారు. వారిని సాజిద్‌ అక్రమ్‌ (50), నవీద్‌ అక్రమ్‌ (24)గా గుర్తించారు. పాకిస్థాన్‌ నుంచి వలస వచ్చిన ఈ కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో నివసిస్తోంది. సాజిద్‌ స్థానికంగా పండ్ల దుకాణం నడుపుతుండగా, నవీద్‌ రెండు నెలల క్రితమే ఉద్యోగం కోల్పోయినట్లు సమాచారం. చేపల వేటకు వెళ్తున్నామని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దాడి సమయంలో సాజిద్‌ అక్కడికక్కడే మృతి చెందగా, నవీద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement