Akash Bobba: మస్క్ డోజ్ బృందంలో భారత సంతతికి చెందిన యువకుడు.. ఎవరీ ఆకాశ్ బొబ్బ..?
ఈ వార్తాకథనం ఏంటి
వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పుల లక్ష్యంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) శాఖను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేశారు.
ఈ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు అప్పగించారు.
తాజాగా ఈ విభాగం ఆరుగురు యువ ఇంజినీర్లను విధుల్లోకి తీసుకుంది.
వీరిలో భారత సంతతికి చెందిన ఆకాశ్ బొబ్బ (Akash Bobba) కూడా ఉన్నాడు. దీంతో అతడి పేరు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వివరాలు
యువ ఉద్యోగుల నియామకాలపై ఆందోళనలు
DOGE నియమించిన ఆరుగురు కూడా 19 నుంచి 24 సంవత్సరాల వయస్సున్న యువకులే.
వీరిలో కొందరు ఇటీవలే కాలేజీ విద్యను పూర్తిచేశారు, మరొకరు ఇంకా చదువుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి అనుభవం లేని వీరిని DOGE ఉద్యోగులుగా నియమించడం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.
అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన సున్నితమైన డేటాను తెలుసుకునేందుకు DOGEకు అనుమతి ఉన్న నేపథ్యంలో ఈ యువ ఉద్యోగుల నియామకాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
ఎవరీ ఆకాశ్ బొబ్బ?
ఆకాశ్ బొబ్బ (Akash Bobba)గురించి పూర్తి వివరాలు ఇంకా అందుబాటులో లేవు.
అతడి లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ కూడా డిలీట్ చేయబడింది. గతంలో ఉన్న వివరాల ప్రకారం,ఆకాశ్ బెర్కెలీ, కాలిఫోర్నియాలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మేనేజ్‌మెంట్,టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యాడు.
మెటా, పలంటీర్ సంస్థల్లో ఇంటర్న్‌గా పనిచేశాడు. ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్‌లో కొంతకాలం పనిచేసినట్లు సమాచారం.
ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో నిపుణుడిగా పనిచేశాడని తెలుస్తోంది.
ఆకాశ్‌తో పాటు ఎడ్వర్డ్ కొరిస్టీన్, ల్యూక్ ఫారిటర్,గౌటియర్ కోల్ కిలియాన్,గావిన్ క్లిగెర్,ఇథాన్ షావోత్రన్‌ను కూడా DOGE ఉద్యోగులుగా నియమించారు.
వీరిలో షావోత్రన్ హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ రెండవ సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది.
గతంలో మస్క్ నిర్వహించిన ఎక్స్‌ఏఐ హ్యాకథాన్‌లో ఇతడు రన్నరప్‌గా నిలిచాడు.