Anura kumara dissanayake:శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన వామపక్ష నేత..అనుర కుమార దిసానాయకే ఎవరు?
తీవ్ర ఆర్థిక సంక్షోభం వేళ దివాలా అంచున ఉన్న శ్రీలంకలో ఉత్కంఠభరితంగా జరిగిన త్రిముఖ ఎన్నికల పోరులో మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించారు. రాజపక్స కుటుంబం అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు, మార్క్సిస్టు విధానాల పట్ల ఆకర్షితులై దిసనాయకేను తమ దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే సాధించిన దిసనాయకే, ఈ సారి అవినీతి వ్యతిరేకతను ప్రచార అస్త్రంగా ఉపయోగించి 42.31 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు.
చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో భాగస్వామ్యం
1987లో మార్క్సిస్టు ప్రభావిత జనతా విముక్తి పెరమున (జేవీపీ)లో చేరిన దిసనాయకే, తన రాజకీయ ప్రస్థానానికి పునాది వేసుకున్నారు. 1998 నాటికి పార్టీ పొలిట్‌బ్యూరోలో స్థానం సంపాదించిన ఆయన, 2000లో ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేవీపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
ప్రజానాడిని పసిగట్టిన నాయకుడు
2022లో శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల్లో వ్యాపించిన అసంతృప్తిని సద్వినియోగం చేసుకుని దిసనాయకే, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృత ప్రచారం నిర్వహించారు. గత పాలకుల అవినీతి, వైఫల్యాలను ప్రజలకు వివరించి, జవాబుదారీతనం ప్రాముఖ్యతను ప్రజల్లో స్థిరపరిచారు. రాజపక్స రాజీనామా తర్వాత ఏర్పడిన నాయకత్వ లోటు, నిరుత్సాహపూరిత పరిస్థితుల్లో మార్పు కోరుకుంటున్న యువతను ఆకర్షించడంలో దిసనాయకే విజయం సాధించారు.
విద్యార్థి రాజకీయాల నుంచి దేశాధినేతగా
విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన దిసనాయకే, శ్రీలంకలో ఓ కీలక నాయకుడిగా ఎదిగారు. 1968 నవంబర్ 24న కొలంబో నుంచి 100 కి.మీ దూరంలోని తంబుట్టెగామలో ఒక కార్మిక కుటుంబంలో జన్మించిన దిసనాయకే, తమ గ్రామం నుంచి యూనివర్సిటీలో చేరిన తొలి విద్యార్థిగా గుర్తింపు పొందారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన ఆయన, ఆ తర్వాత సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్‌లో చేరి విద్యార్థి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు.