Anura kumara dissanayake: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా దిసనాయకే ఎన్నిక..నేడు ప్రమాణ స్వీకారం
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరమున పార్టీ నేత అనుర కుమార దిసనాయకే (56) విజయాన్ని అందుకున్నారు. ఆదివారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో, దిసనాయకే అధిక మెజార్టీతో విజయాన్ని సాధించి, అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. మొత్తం పోలైన ఓట్లలో 42.31% ఓట్లు అనుర కుమార దిసనాయకేకు వచ్చినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. విపక్ష నేత సజిత్ ప్రేమదాస (సమగి జన బలవేగాయ/ఎస్‌జేబీ) 32.76% ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మొదటి రౌండ్‌లోనే పోటీ నుంచి వైదొలిగారు. దిసనాయకే సోమవారం శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ఆయన నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) పార్టీ వెల్లడించింది.
75% పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం జరగగా, ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. మొదట ప్రాధాన్యతా ఓట్లను లెక్కించినప్పటికీ, విజయం సాధించడానికి అవసరమైన 50% కంటే ఎక్కువ ఓట్లు ఏ అభ్యర్థికీ రాలేదు. ఫలితంగా గెలుపును ఖరారు చేయడానికి రెండో రౌండ్ కౌంటింగ్ నిర్వహించాల్సి వచ్చింది, ఇందులో దిసనాయకే విజయం సాధించారు. మొత్తం 1.7 కోట్ల మంది నమోదైన ఓటర్లలో 75% పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. దిసనాయకే నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు భారత్ తన శుభాకాంక్షలు తెలిపింది.
చరిత్రలో తొలిసారి...
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రెండో రౌండ్ కౌంటింగ్ జరగడం ఇదే మొదటిసారి. మునుపటి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతా ఓట్ల సమయంలోనే విజేత ఎవరో ఖరారయ్యేవారు. ఈసారి ఏ అభ్యర్థికి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో, రెండో ప్రాధాన్యతా ఓట్లను లెక్కించాల్సి వచ్చిందని ఎన్నికల కమిషన్ ఛైర్మన్ ఆర్‌ఎంఏఎల్ రత్నాయకే వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం, ఈ రోజు (సోమవారం) అనుర కుమార దిసానాయకే శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో, ఆయన శ్రీలంక తొమ్మిదవ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.